‘ఓట్‌’ ఈజ్‌ దిస్‌?

ABN , First Publish Date - 2021-03-21T15:55:43+05:30 IST

జగ్గయ్యపేట పురపాలక సంఘ పరిధిలోని అన్ని వార్డుల్లో కుల గణన తర్వాత విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా తప్పులతడకగా..

‘ఓట్‌’ ఈజ్‌ దిస్‌?

తప్పులతడకగా పేట ఓటర్ల జాబితా 

స్త్రీల ఫొటో వద్ద పురుషుల పేర్లు

మృతులకూ జాబితాలో ఓటు హక్కు

వార్డు వలంటీర్లకు రెండు, మూడు ఓట్లు

ఒకే కుటుంబ సభ్యులకు వేర్వేరు వార్డుల్లో ఓట్లు

అధికారుల తప్పిదాలు చూసి నవ్వుకుంటున్న ఓటర్లు


జగ్గయ్యపేట: జగ్గయ్యపేట పురపాలక సంఘ పరిధిలోని అన్ని వార్డుల్లో కుల గణన తర్వాత విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉంది. ఓటర్ల జాబితాలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. మృతి చెందిన వారికీ అధికారులు ఓటు హక్కు కల్పించారు. ఇటీవల మృతిచెందిన వారికే కాక ఐదారేళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిచ్చాయి. ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు ఇచ్చారు. అంతటితో ఆగలేదు సుమీ!.. ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు వార్డుల్లో ఓటు హక్కు కల్పించారు. అంతేనా.. స్త్రీల ఫొటో వద్ద పురుషుల పేర్లు ప్రచురించారు. 


ఓటర్ల జాబితా తయారీలో అధికారులు దారుణమైన తప్పిదాలు చేశారు. వేదాద్రి మునసబ్‌గా పిలవబడే శేషగిరిరావు, వేర్‌హౌస్‌ గోడౌన్‌లో పనిచేసిన సుబ్బారావు, గోవర్ధన్‌ అనే వ్యక్తులు మృతి చెంది సంవత్సరాలు గడిచినా ఓటర్లుగా కొనసాగించారు.  కొన్ని వార్డుల్లో పేరు, తండ్రిపేరు, డోర్‌ నెంబర్‌ కాని, ఇంటిపేరు కాని లేకుండా ఓటర్లుగా చూపారు. కొన్ని చోట్ల పురుషుల పేరుతో ఓటు ఉండగా, ఫోటో స్త్రీలది ఉంది. 31వ వార్డుకు చెందిన నాగేశ్వరరావు పేరుతో ఓటు ఉండి మహిళ ఫోటో ఉంది. అదే వార్డులో వార్డు వలంటీరుగా ఉన్న రామలక్ష్మీకి రెండు వార్డుల్లో ఓటరుగా చూపారు. మరో వార్డు వలంటీరు భార్యాభర్తలకు రెండుచోట్ల ఓట్లు వచ్చాయి. స్ర్తీల పేర్లతో పురుషుల ఫోటోలతో కనిపించాయి. రిటైరై వెళ్లిపోయిన అనేకమంది ఉద్యోగుల పేర్లు జాబితాలో చోటుచేసుకున్నాయి. వార్డులలో ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లోకి మారిపోయాయి. ఒకే కాంప్లెక్సులో ఉన్న వారి ఓట్లు వేర్వేరు బూత్‌ల్లోకి మారిపోయాయి.  ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు కూడా ఉన్నాయి. 31వ వార్డుగా గుర్తించబడిన శాంతినగర్‌కు చెందిన శ్రీనివాసరావు ఓటు ఒకటో వార్డులో ఉండగా, భార్యకు 30వ వార్డులోనూ, కూతురికి  31వ వార్డు లోనూ ఉంది. సాధారణ వ్యక్తుల సంగతి పక్కన బెడితే పట్టణంలో పేరు మోసిన, పెద్ద ఉద్యోగాలు చేసి గుర్తించబడి అమరులైన వారి ఓట్లను తొలగించకపోవటం చర్చనీయాంశమైంది.


జాబితాలో అనేకమంది స్థానికేతరులకు ఓటు కల్పించటంపై రాజకీయ పార్టీలు పెదవి విరుస్తున్నాయి. గతంలో ఇక్కడ ట్రాన్స్‌కో ఏడీఈగా పనిచేసిన రవిచంద్రకు సంబంధించి 6 ఓట్లు ఒకటో వార్డులో ఉన్నాయి. ఇంకా గరికపాడు కేవీకేలో, ట్రాన్స్‌కో, హౌసింగ్‌ల్లో గతంలో  ఇక్కడ పనిచేసిన వారి పేర్ల మీద ఓట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పురపాలకసంఘం ఇచ్చిన జాబితాతో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఒక విడత సర్వే చేసి తుది జాబితాను ఏ విధంగా సిద్ధం చేశారో అర్థం కావట్లేదని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. జాబితాపై కసరత్తు చేస్తున్న రాజకీయ పార్టీల నేతలు ఒక్కొక్క బూత్‌లో 10-20 మంది చనిపోయిన ఓట్లు ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-03-21T15:55:43+05:30 IST