ఏర్పాట్లు ముమ్మరం

ABN , First Publish Date - 2021-12-26T06:25:54+05:30 IST

భవానీల దీక్ష విరమణకు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే భక్తులకు వీఎంసీ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేసింది.

ఏర్పాట్లు ముమ్మరం

190 ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు 

కంట్రోల్‌ రూమ్‌ ఫిర్యాదులకు స్వతర పరిష్కారం

చిట్టినగర్‌, డిసెంబరు 25 : భవానీల దీక్ష విరమణకు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే భక్తులకు వీఎంసీ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేసింది. కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాల మేరకు శనివారం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అందుబాటులో ఉండేలా 190 ప్రదేశాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 24 గంటలు శుభ్రంగా ఉండేలా సిబ్బందిని నియమించారు. నిరంతరం నీటి సరఫరా అందుబాటులో ఉండేలా ఏ ర్పాట్లు చేశారు. దేవస్థానం పరిసర ప్రాంతాలతోపాటు భవానీల గిరి ప్రదక్షణ మార్గంలో ప్రత్యేక కౌంటర్లను ఏ ర్పాటు చేసి తాగునీటి ట్యాంక్‌తో పాటు మంచినీటి ప్యా కెట్లు అందుబాటులో ఉంచారు. యాత్రికుల సౌకర్యార్థం ఎస్టేట్‌ విభాగం ద్వారా వీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద, రాజీవ్‌గాంధీ పార్కు, రథం సెంటర్‌, హెడ్‌ వాటర్‌ వర్క్‌ వద్ద సామగ్రి, పాదరక్షలు భద్రపరచుటకు 24 గంటలు పనిచేసేలా నాలుగు ప్రదేశాలలో క్లోక్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. 

పరిశుభ్రతే ప్రధానంగా.. 

ప్రజారోగ్య విభాగం ద్వారా పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. క్రిమి సంహారకాలు జల్లుతూ, పాగింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్లలో 30ప్రాంతాల్లో కొవిడ్‌-19 దృష్టిలో ఉంచుకొని భక్తులకు థర్మల్‌ స్కానింగ్‌, శానిటైజేషన్‌ నిర్వహిస్తూ, మాస్క్‌లు అందజేసేందుకు చర్య లు చేపట్టారు. కొవిడ్‌-19 దృష్ట్యా భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వార్డు శానిటేషన్‌ సెక్రటరీల ద్వారా మైక్‌ లో అవగాహన చేపట్టారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలో మూడు షిష్ట్‌లలో 24గంటలు పనిచేసేలా కంట్రోల్‌రూమ్‌ ఫోన్‌ 81819 60909ను ఏర్పాటు చేసి ఫిర్యాదులు అందిన వెంటనే యుద్ధప్రాతిపదికన పరిష్కరించేలా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్‌ యు.శారదాదేవి, చీఫ్‌ మెడికల్‌ అధికారి గీతాభాయి, ఎస్టేట్‌ అధికారి టి.శ్రీనివాస్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

Updated Date - 2021-12-26T06:25:54+05:30 IST