'భారత న్యాయవ్యవస్థ-భవిష్యత్తు సవాళ్లు' అంశంపై సీజేఐ ప్రసంగం

ABN , First Publish Date - 2021-12-26T18:00:52+05:30 IST

కానూరులోని సిద్ధార్థ బీటెక్‌ కాలేజీలో జస్టిస్‌ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాస సభ జరిగింది.

'భారత న్యాయవ్యవస్థ-భవిష్యత్తు సవాళ్లు' అంశంపై సీజేఐ ప్రసంగం

విజయవాడ: కానూరులోని సిద్ధార్థ బీటెక్‌ కాలేజీలో జస్టిస్‌ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాస సభ జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా 'భారత న్యాయవ్యవస్థ-భవిష్యత్తు సవాళ్లు' అంశంపై ఆయన ప్రసంగించారు. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. 1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని, సరైన సమయంలో తగిన నిర్ణయాలతో సంక్షోభం అధిగమించగలిగామన్నారు. కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిందని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఆర్థిక సంస్కరణలొచ్చాయన్నారు. జ్యుడీషియరీ కూడా అనేక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొందని, రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషించిందని సీజేఐ వ్యాఖ్యానించారు.


ఎన్నో ఏళ్లుగా న్యాయవ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. రాజ్యాంగం మూడు సమాన వ్యవస్థలను తయారు చేసిందని, న్యాయవ్యవస్థలో ప్రతీ చర్యకు స్థిరమైన రికార్డ్‌ ఉండాలన్నారు. రాజ్యాంగ పరిధిని తెలుసుకుని అందరూ పనిచేయాలని సూచించారు. ఇప్పుడు హ్యాకింగ్ అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం జడ్జీలకు చాలా ముఖ్యమని, ప్రాసిక్యూటర్లను నియమించడానికి ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. ఇటీవల జడ్జిలపై భౌతికదాడులు పెరిగాయని, కోర్టు ఆర్డర్ చేసే వరకూ దాడుల కేసులపై విచారణ జరగడం లేదన్నారు. కోర్టు ఆదేశాలను వ్యతిరేకించకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు.

Updated Date - 2021-12-26T18:00:52+05:30 IST