నెంబర్‌ 1 వత్సవాయి

ABN , First Publish Date - 2021-02-01T06:49:46+05:30 IST

విజయవాడ డివిజన్‌ పరిధిలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అతిపెద్ద మండలంగా వత్సవాయి నిలిచింది. ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా, హుందాగా జరుగుతుంటాయి.

నెంబర్‌ 1 వత్సవాయి

విజయవాడ డివిజన్‌లో అతిపెద్ద మండలం 

25 పంచాయతీలు, 228 వార్డులు 

రెండో అతిపెద్ద మండలంగా నందిగామ

అతి తక్కువ పంచాయతీలు కలిగిన మండలాలు ఇబ్రహీంపట్నం, పెనమలూరు 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : విజయవాడ డివిజన్‌ పరిధిలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అతిపెద్ద మండలంగా వత్సవాయి నిలిచింది. ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా, హుందాగా జరుగుతుంటాయి. ఈ మండలంలో గరిష్టంగా 25 పంచాయతీలు ఉన్నాయి. దేచుపాలెం, మంగొల్లు, పెదమోదుగుపల్లి, చిన్నమోదుగుపల్లి, గోపినేని పాలెం, భీమవరం, మక్కపేట, కన్నెవీడు, ఇందుగుపల్లి, రామచంద్రాపురం, చిట్టేల, సింగవరం, లింగాల, పుర్హవరం, అల్లూరుపాడు, వేమవరం, కంభంపాడు, తల్లూరు, మేచినేనిపాలెం, వేములనర్వ, వత్సవాయి, దబ్బాకుపల్లి, పెంటలవారిగూడెం, పోలంపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో అత్యధికంగా 228 వార్డులున్నాయి. 

రెండో స్థానంలో నందిగామ

రెండో ఎక్కువ పంచాయతీలు కలిగినది నందిగామ మండలం. అడవిరావులపాడు, అంబారుపేట, చందాపురం, దాములూరు, గొల్లమూడి, ఐతవరం, జొన్నలగడ్డ, కంచెల, కమ్మవారిపాలెం, కేతవీరునిపాడు, కొణతమాత్కూరు, కొండూరు, లింగాలపాడు, మాగల్లు, మునగచెర్ల, పల్లగిరి, పెద్దవరం, రాఘవాపురం, రామిరెడ్డిపల్లి, రుద్రవరం, సోమవరం, తక్కెళ్లపాడు, తొర్రగుడిపాడు మొత్తం 23 పంచాయతీలు ఉన్నాయి. వత్సవాయి తరహాలోనే 228 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత వీరులపాడు, జి.కొండూరు మండలాలు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ చెరి 22 పంచాయతీలు ఉన్నాయి. జి.కొండూరు మండలంలో 224 వార్డులు ఉన్నాయి. కానీ, వీరులపాడు మండలంలో 168 వార్డులే ఉన్నాయి. డివిజన్‌లో కొన్ని మండలాల పరిధిలో పంచాయతీలు, వార్డులకు పోలికే ఉండవు. పెనమలూరు మండలానికి వస్తే కేవలం 10 గ్రామాల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 158 వార్డులు ఉండటం విశేషం. అంటే సగటున ఒక గ్రామానికి 15 వార్డుల చొప్పున ఉన్నాయి. అతి తక్కువ పంచాయతీలు కలిగిన మండలాల్లో పెనమలూరు, ఇబ్రహీంపట్నం ఉన్నాయి. రెండూ ర్యాపిడ్‌ గ్రోత్‌ ఏరియాల్లో ఉన్నాయి. విజయవాడకు తూర్పున పెనమలూరు ఉండగా, పశ్చిమాన ఇబ్రహీంపట్నం ఉంది. ఈ మండలాల్లోని కొన్ని పంచాయతీలు మునిసిపాలిటీల పరిధిలోకి చేరటంతో ఎన్నికలను నిర్వహించటానికి వీలు పడలేదు. దీంతో చెరి పది పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

డివిజన్‌లోని 14 మండలాల్లోని గ్రామాలు, వార్డులు

విజయవాడ రూరల్‌ మండలంలో 12 గ్రామాలు, 166 వార్డులున్నాయి. వీరులపాడులో 22 గ్రామాలు, 168 వార్డులు, వత్సవాయి మండలంలో 25 గ్రామాలు, 228 వార్డులు, తోట్లవల్లూరులో  16 గ్రామాలు, 126 వార్డులు, పెనుగంచిప్రోలు మండలంలో 15 గ్రామాలు, 162 వార్డులు, పెన మలూరు మండలంలో 10 గ్రామాలు, 158 వార్డులు, నందిగామ మండలంలో 23 గ్రామాలు, 228 వార్డులు,  మైలవరం మండలంలో 13 గ్రామాలు, 154 వార్డులు, కంకి పాడు మండలంలో 20 గ్రామాలు, 136 వార్డులు, జగ్గయ్యపేట మండలంలో 17 గ్రామాలు, 190 వార్డులు, చందర్లపాడు మండలంలో 18 గ్రామాలు, 186 వార్డులు, జి.కొండూరు మండలంలో 22 గ్రామాలు, 224 వార్డులు, ఇబ్రహీంపట్నం మండలంలో 10 గ్రామాలు, 116 వార్డులు, కంచికచర్ల మండలంలో 16 గ్రామాలు, 156 వార్డులు ఉన్నాయి. 

ఎన్నికలు జరగని పంచాయతీలివే..

విజయవాడ రూరల్‌ మండలంలో జక్కంపూడి, వైఎస్సార్‌ పంచాయతీ, గొల్లపూడి, రామరాజ్యనగర్‌లో ఎన్నికలు జరగటం లేదు. 2011 సెన్స్‌ ప్రకారం కొత్తగా ఏర్పాటైన ఈ పంచాయతీల్లో ఎలాంటి  జనాభా లేనందున ఎన్నికలను నిర్వహించట్లేదు. ఈ ప్రాంతంలోని వారు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోకి రావటంతో అక్కడ వారికి ఓటుహక్కు ఉంది. దీంతో పంచాయతీలు నామినల్‌గా ఉన్నాయి. జగ్గయ్యపేట మండలంలో షేర్‌ మహమ్మద్‌పేట, చిల్లకల్లు, తిరుమలగిరి పంచాయతీలు జగ్గయ్యపేట మునిసిపాలిటీల పరిధిలో విలీన ప్రతిపాదనలో ఉండటంతో వీటికి ఎన్నికలు నిర్వహించటం లేదు. పెనమలూరు మండలంలో కానూరు, తాడిగడప, యనమలకుదురు, పోరంకి గ్రామాలు తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోకి  వెళ్లటంతో ఎన్నికలు నిలిపివేశారు.

Updated Date - 2021-02-01T06:49:46+05:30 IST