ఈదురు గాలుల బీభత్సం

ABN , First Publish Date - 2021-05-05T06:32:55+05:30 IST

మైలవరం, జి.కొండూరు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.

ఈదురు గాలుల బీభత్సం

మైలవరంలో భారీ వర్షం 

 మార్కెట్‌ యార్డ్‌లో తడిసిన ధాన్యం, మొక్కజొన్నలు 

 రాలిపోయిన మామిడి కాయలు 

మైలవరం రూరల్‌, జి.కొండూరు, మే 4: మైలవరం, జి.కొండూరు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మైలవరం మండలంలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. బలమైన గాలులు వీయడంతో మామిడి కాయలు 70 శాతం రాలిపోయాయని రైతులు వాపోయారు. అసలే కరోనా దెబ్బకు ధరలు పడిపోయి లబోదిబోమంటున్న రైతులను ఈదురుగాలులతో కూడిన వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. పుల్లూరు ధాన్య కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దాయ్యాయి. బాడవ టోల్‌ ప్లాజా వద్ద రోడ్డు మీద ఆరబెట్టుకున్న ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి. మైలవరం మార్కెట్‌ యార్డ్‌లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి తడిసి పోయింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్న ధాన్యం తడవకుండా యార్డ్‌లో పట్టాలు సిద్ధం చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా రైతులు ఆరబోస్తున్న ధాన్యంతో పాటు మొక్కజొన్న కూడా తడిసిపోయాయి. పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్‌ లైన్లపై పడటంతో మైలవరంలో రాత్రి పొద్దుపోయే వరకు విద్యుత్‌ సరఫరా చేయలేదు. జి.కొండూరులో థియేటర్‌ రోడ్డులో ఓ భారీ చెట్టు విరిగి విద్యుత్‌లైన్‌ మీద పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  

వీరులపాడు : ఈదురుగాలులు, అకాల వర్షంతో మండలంలోని మొక్కజొన్న, మిర్చి, వరి రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కురవటంతో పంటపై పరదాలు కప్పేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. సాయంత్రం వరకు ఎండగా ఉండి ఒక్కసారిగా మేఘాలు ఆవరించి వర్షం పడటంతో చేతికొచ్చిన పంట దెబ్బతింటుందేమోనన్న ఆందోళన పడ్డారు. కొంతమంది రైతులు మిర్చిపై పరదాలు కప్పకపోవటంతో పంట తడిసింది. అకాల వర్షాలతో ఏ ఏడాదికేడాది నష్టమే తప్ప లాభాలు చూడలేకపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులకు మామిడి కాయలు రాలి దెబ్బతినటంతో రైతులు లబోదిబోమంటున్నారు. 


Updated Date - 2021-05-05T06:32:55+05:30 IST