అకాలవర్షం.. అన్నదాతల్లో ఆందోళన

ABN , First Publish Date - 2021-05-05T05:43:50+05:30 IST

అకాలవర్షం.. అన్నదాతల్లో ఆందోళన

అకాలవర్షం.. అన్నదాతల్లో ఆందోళన
తిరువూరు మండలంలో ధాన్యం రాశులపై కప్పిన పట్టాలు

తిరువూరు, మే 4: పట్టణం, మండలంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి, ఒక మోస్తారు వర్షం కురవడంతో రైతులు బెంబెలేత్తారు. మంగళవారం ధాన్యం కొనుగోలు చేయాలని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన రైతులు తమ సమస్యను తహసీల్దార్‌కు వివరించి తిరిగి వారి గ్రామాలకు చేరుకున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి వర్షం కురిసింది. దీంతో ఉరుకులు పరుగులతో ధాన్యం తడవకుండా కుప్పలా చేసి  పట్టాలు కప్పారు. ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో భారీ వర్షం కురిసి, ధాన్యం పూర్తిగా తడిచి పోతుందేమోనని రైతులు అందోళన చెందారు, కొద్దిపాటి వర్షం వచ్చి అగిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

రైతుల గుండెల్లో గుబులు

చాట్రాయి: మండలంలో మంగళవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడటంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం రబీ మొక్కజొన్న, ధాన్యం 80 శాతం పంట కల్లాల్లోనే ఉంది. ఇప్పుడు అకాల వర్షాలు కురిస్తే పంట తడిచి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ఈ క్రాప్‌ రిజిస్ర్టేషన్‌, షెడ్యూల్‌ ప్రక్రియల వలన కాటాలు మందకొడిగా సాగుతున్నాయి. మండలంలో సుమారు 10 వేల ఎకరాలలో మొక్కజొన్న, 3వేల ఎకరాలలో వరి సాగు చేశారు. కల్లాలు అన్నీ చెరువుల్లోనే ఉన్నాయి. భారీ వర్షాలు కురిసి చెరువులు నిండితే అరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలు అయ్యే ప్రమాదం ఉన్నదని రైతులు కలవర పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.

ఆగిరిపల్లిలో చిరుజల్లులతో ఉపశమనం

ఆగిరిపల్లి: మండలంలో మంగళవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. సాయంత్రం 5 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఈ జల్లులకు ఈదురు గాలులు తోడవలేదు. దీంతో మామిడి రైతాంగం ఊపిరి పీల్చుకుంది. వేసవి తాపం నుంచి అల్లాడుతున్న ప్రజానీకానికి ఈ చిరుజల్లులు ఉపశమనాన్ని ఇచ్చాయి. 


Updated Date - 2021-05-05T05:43:50+05:30 IST