టోల్‌ప్లాజా నిర్మాణాన్ని నిలిపి వేయాలి

ABN , First Publish Date - 2021-03-22T06:54:12+05:30 IST

టోల్‌ప్లాజా నిర్మాణాన్ని తరలించి, గురుకుల పాఠశాలలను రక్షించుకునేందుకు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడబోమని అగ్నికుల క్షత్రియ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు, గురుకుల పాఠశాల పరిరక్షణ సాధన సమితి ప్రతినిఽధులు అన్నారు.

టోల్‌ప్లాజా నిర్మాణాన్ని నిలిపి వేయాలి
నిరాహారదీక్షలో గురుకుల పాఠశాలల పరిరక్షణ సాధన సమితి సభ్యులు...చిత్రంలో ఎమ్మెల్యే రమేష్‌బాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు

మోపిదేవి, మార్చి 21: టోల్‌ప్లాజా నిర్మాణాన్ని తరలించి, గురుకుల పాఠశాలలను రక్షించుకునేందుకు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడబోమని అగ్నికుల క్షత్రియ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు, గురుకుల పాఠశాల పరిరక్షణ సాధన సమితి ప్రతినిఽధులు అన్నారు. ఆదివారం మోపిదేవిలో ఆశ్రమ పాఠశాల ఆవరణలో పాఠశాల పరిరక్షణ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. సాధన కమిటీ సభ్యులు లకనం నాగాంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ సంఘం జాతీయ నాయకులు పలువురు మాట్లాడుతూ టోల్‌ ప్లాజా నిర్మాణాన్ని ఏ ఒక్కరూ వ్యతిరేకించటం లేదని, కానీ పాఠశాలల వద్ద కాకుండా వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చూడాలని విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ, టోల్‌ప్లాజా నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌లు గత ప్రభుత్వ హయాంలోనే రూపొందించారని, దీనిని నాడు ఉపసభాపతిగా ఉన్న మండలి బుద్ధప్రసాద్‌, మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రలు ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. పాఠశాలల మనుగడకు వెనకడుగు వేయబోమని, ఇప్పటికే మంత్రులు, ఎంపీల ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈ అంశాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, టీడీపీ ఎంపీల సహాయంతో ఢిల్లీలో కేంద్రమంత్రిని కలుస్తామని రవీంద్ర తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో టోల్‌ప్లాజా నిర్మాణాలకు సంబంధించి డీపీఆర్‌లు రూపొందించాలన్న ప్రస్తావన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని రవీంద్ర స్పష్టం చేశారు. ఆందోళన ఉధృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అగ్నికుల క్షత్రియ పాఠశాలల పరిరక్షణ సాధన సమితి సభ్యుడు బర్రె ప్రసాద్‌, సైకం భాస్కరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, చెన్ను రంగారావు, బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు, ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్‌ కరీముల్లా ఖాన్‌, సీఐటీయూ నాయకులు శీలం నారాయణరావు, ఆవుల బసవయ్య, బండి ఆదిశేషు, జనసేననాయకులు రాయపూడి వేణుగోపాలరావు, నాయుడు సాంబశివరావు, దివి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు, కోలా బాలాజీ వర్మ, అవనిగడ్డ ప్రకాశం తదితరులు ఉన్నారు.  

Updated Date - 2021-03-22T06:54:12+05:30 IST