థియేటర్లు స్వచ్ఛందంగా మూత!
ABN , First Publish Date - 2021-12-26T06:22:08+05:30 IST
థియేటర్లు స్వచ్ఛందంగా మూత!

హనుమాన్‌జంక్షన్, డిసెంబరు 25 : రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో థియేటర్లు నడపలేక జంక్షన్‌లోని రెండు థియేటర్లు స్వచ్ఛందంగా మూసి వేశారు. స్థానిక విజయవాడ రోడ్డులో ఆర్డీసీ బస్టాండ్ పక్కనే ఉన్న శ్రీకృష్ణా థియేటర్‌ను సురేష్ ప్రొడక్షన్స్ యాజమాన్యం లీజుకు తీసుకుని నిర్వహిస్తోంది. విజయవాడ రోడ్డుకు సమీపంలోనే మాజీ ఉప సర్పం చ్ కాకాని వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన మరో థియేటర్ కెఎస్ టాకీస్ కూడా ఉంది. పవన్ కల్యాణ్ సినిమా వకీల్‌సాబ్ చిత్రం విడుదల సమయంలోనే జీవో నెం : 35 వచ్చింది. జీవో రాక మునుపు ఈ థియే టర్లలో బాల్కనీ క్లాస్ నుంచి నేల వరకు రూ.100, 60, 40లు రేట్లుతో నడిచేవి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో ప్రకారం పంచాయతీ పరిధిలో థియేటర్లకు ఈ మూడు క్లాస్‌ల రేట్లు రూ.20, 15, 10గా నిర్ణయిం చారు. ప్రభుత్వం నిర్ణయించిన కొత్త రేట్లు అమలు చేయాలని అధికారులు తనిఖీలు నిర్వహించి ఒత్తిడి తెచ్చారు. ఈనెల 2న విడుదలైన బాలకృష్ణ సినిమా అఖండ, 17న రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప చిత్రా లు విడుదల సందర్భంలో కూడా థియేటర్ల యజమా నులపై అధికారులు ఒత్తిడి తెచ్చారు. ఏసీ థియేటర్లు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను అమలు చేస్తే కనీసం విద్యుత్ చార్జీలు, వర్కర్ల జీతా లు కూడ రావన్న భయంతో పాత పద్ధతిలోనే టికెట్లు అమ్మినట్లు తెలిసింది. చివరికి అధికారులు ఒత్తిడిని తట్టుకోలేక తమకు తామే స్వచ్ఛందంగా మూతవేశారు. తగ్గించిన రేట్లతో థియేటర్‌ను నడిపి నష్టాలను భరిం చడం కంటే మూసివేయడం మేలని భావించి ఈనెల 22వ తేదీ నుంచి స్వచ్ఛందంగా మూత వేశారు.