భారాల భయం

ABN , First Publish Date - 2021-12-30T06:30:50+05:30 IST

సొంత గూడు అమరుతోందనే సంతోషం కంటే భారాల భయమే పేదలను వెంటాడుతోంది.

భారాల భయం

ఇళ్ల స్థలాల మెరక ఖర్చులు పేదలపైనే!

ప్రభుత్వం నుంచి బిల్లులు బంద్‌! 

ప్లాట్‌కు రూ.4 వేల వరకు బకాయిలు 

మెరక పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు 

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులకూ నిధులు నిల్‌!


సొంత గూడు అమరుతోందనే సంతోషం కంటే భారాల భయమే పేదలను వెంటాడుతోంది. జగనన్న ఇళ్ల నిర్మాణం మాటెలా ఉన్నా, ప్రభుత్వం ఏదో ఒక వంకన పరోక్షంగా లబ్ధిదారులపై భారాలు మోపుతూనే ఉంది. తాజాగా ఇళ్ల స్థలాల మెరకకు అయ్యే ఖర్చులు లబ్ధిదారులే భరించాల్సి రావడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం నుంచి రావలసిన మెరక పనుల బిల్లులు నిలిచిపోవడం, కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడ నిలిపివేయడమే ఈ పరిస్థితికి కారణం. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో జగనన్న ఇళ్ల స్థలాల మెరక పనులకు ప్రభుత్వం నుంచి రావలసిన బిల్లులు నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులను పక్కన పెట్టేశారు. అధికారులు నయానా, భయానా చెప్పినా వారు వినే పరిస్థితి లేదు. చేసిన పనులకు బిల్లులు చెల్లించిన తర్వాతే పనుల గురించి మాట్లాడండంటూ కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు. దీంతో మిగిలిన మట్టి లెవెలింగ్‌ పనులకు సంబంధించిన ఖర్చులు కూడా పేదలపైనే పడుతున్నాయి. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు దశల వారీగా చెల్లించాల్సిన డబ్బులే సకాలంలో జమ కావడంలేదు. దీంతో లబ్ధిదారులు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టుకున్నారు. ఇళ్లు కట్టుకునేందుకు సిద్ధమయిన వారు ముందుగా ప్లాట్‌ను మెరక చేసుకోవాల్సి ఉంది. లే అవుట్‌లు లోతట్టు ప్రాంతాల్లో ఉండటంతో వాటిని మెరక చేసేందుకు జిల్లా యంత్రాంగం కాంట్రాక్టర్లను పిలిచింది. వారికి క్వారీలను కూడా కేటాయించింది. మొదట్లో పనులు బాగానే జరిగినా, బిల్లులు రాకపోవటంతో కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడ ఆపేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా 70 శాతం లే అవుట్లలో మెరక పనులు నిలిచిపోయాయి. 


పై నుంచి కిందికి పెరుగుతున్న ఒత్తిళ్లు

ఒకపక్క కలెక్టర్‌, జాయింట్‌ క లెక్టర్లు వరస సమీక్షలతో పనుల పురోగతి గురించి ప్రశ్నిస్తూ, స్థానిక అధికారులను ఇందుకు బాఽధ్యులను చేస్తున్నారు. వివిధ దశల్లో చెల్లించాల్సిన బిల్లుల గురించి మొరపెట్టుకున్నా వారు వినే పరిస్థితి లేదు. దీంతో స్థానికంగా సంబంధిత అధికారులు మెరక చేయించుకోవాలని లబ్ధిదారులపైనే ఒత్తిడి తెస్తున్నారు. జగనన్న కాలనీల్లో ఒక్కో ప్లాటుకు సగటున నాలుగు వేల రూపాయల చొప్పున మెరక పనులకు ఖర్చు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ మొత్తాన్ని లబ్ధిదారులే భరించాల్సి వస్తోంది. ఇప్పటికే ఇంటి పునాదుల నిర్మాణం కోసం అప్పులు చేస్తున్న లబ్ధిదారులు అదనపు భారం మీద పడడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం ఒత్తిళ్లు భరించలేక క్షేత్రస్థాయిలో కొందరు రెవెన్యూ, హౌసింగ్‌ అధికారులు బిల్లులు వచ్చినపుడు సర్దుబాటు చేసుకోవచ్చని తమ పరిధిలోని కాలనీల్లో మెరక పనులకు సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే ఖర్చు పెట్టినవారు ఎంతకూ బిల్లులు రాకపోవటంతో శక్తికి మించి ఖర్చు చేయలేక వెనకడుగు వేస్తున్నారు.


ఇసుక కోసం ఎన్ని తిప్పలో.. 

ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారుల మెడ మీద కత్తిపెడుతున్న జిల్లా యంత్రాంగం ఇసుకను మాత్రం అందించలేకపోతోంది. ఉచిత ఇసుక కూపన్లు అన్నారు.. ఇవ్వలేదు. ఉచితంగా ఇసుక రవాణా చేస్తామన్నారు. అదీ జరగటం లేదు. ట్రాక్టర్‌ ఇసుకను రూ.6 వేలకు లబ్ధిదారులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అది కూడా ఆన్‌లైన్‌ విధానంలో ఇవ్వటం లేదు. ప్రజాప్రతినిధులు అనధికారికంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. దీంతో పేదలు ఇసుక కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.


ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బిల్లులు ఎందుకు రావు? 

జగనన్న కాలనీల్లో ప్లాట్ల మెరక పనులన్నీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగానే చేపడుతున్నారు. ఈ పనులకు కేంద్ర ప్రభుత్వమే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. చేసిన పనికి చేసినట్టు ఉపాధి హామీ పథకం నిధులు విడుదల అవుతుంటాయి. అయితే మెరక పనులకు ఉపాధి హామీ పథకం నిధులు విడుదల కావటం లేదు. చేసిన పనులకు బిల్లులు పెట్టినా డబ్బులు ఎందుకు రావడంలేదనే సందేహం అందరినీ వెంటాడుతోంది. 

Updated Date - 2021-12-30T06:30:50+05:30 IST