అధికారపక్షమే అభ్యంతరం

ABN , First Publish Date - 2021-10-31T06:28:50+05:30 IST

సింగిల్‌ టెండర్‌ను ఎలా ఆమోదిస్తారు.. మునిసిపల్‌ చట్టప్రకారం ఒక టెండర్‌ వస్తే దానిని రద్దుచేసి తిరిగి పిలవాలని కౌన్సిలర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

అధికారపక్షమే అభ్యంతరం
కౌన్సిల్‌ సమావేశంలో చైర్‌పర్సన్‌ జ్యోత్స్నరాణి, హాజరైన సభ్యులు

 డంపింగ్‌ యార్డు నిర్వహణకు సింగిల్‌ టెండర్‌ను ఒప్పుకోని వైసీపీ ఫ్లోర్‌లీడర్‌ ప్రసాద్‌

పెడన, అక్టోబరు 30 : సింగిల్‌ టెండర్‌ను ఎలా ఆమోదిస్తారు.. మునిసిపల్‌ చట్టప్రకారం ఒక టెండర్‌ వస్తే దానిని రద్దుచేసి తిరిగి పిలవాలని కౌన్సిలర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పెడన మునిసిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ బళ్ళ జ్యోత్స్నరాణి అధ్యక్షతన శనివారం జరిగింది. సమావేశంలో డంపింగ్‌ యార్డు నిర్వహణకు దాఖలైన సింగిల్‌ టెండర్‌ను ఆమోదానికి పెట్టడం పట్ల అధికార పక్షానికి చెందిన(వైసీపీ) ఫ్లోర్‌ లీడర్‌ కటకం ప్రసాద్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సార్లు టెండర్లు పిలిచిన తరువాత కూడా సింగిల్‌ టెండరే వస్తే అప్పుడు ఆమోదించవలసి ఉంటుందన్నారు. సింగిల్‌ టెండర్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే డంపింగ్‌ యార్డు నిర్వహణకు బడ్జెట్‌లో ఆమోదించిన మొత్తం కంటే ఎక్కువ కేటాయించకూడదన్నారు. బడ్జెట్‌కు లోబడి కేటాయింపులు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 9వ వార్డు కౌన్సిలర్‌ గరికముక్కు చంద్రబాబు మాట్లాడుతూ, ఏ పనికయినా బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కంటే ఎక్కువ ఖర్చు చేయాలంటే అందుకు తప్పనిసరిగా కౌన్సిల్‌ అనుమతి తీసుకోవాలన్నారు. చెత్త సేకరణ కోసం అద్దెకు తీసుకున్న ట్రాక్టర్ల అంశంపై 17వ వార్డు కౌన్సిలర్‌ మెట్ల గోపీప్రసాద్‌ మాట్లాడుతూ, తన వార్డులో ఒక్క రోజు కూడా ట్రాక్టర్‌ తిరగలేదన్నారు. విమర్శలపై చైర్‌పర్సన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఏఈ రమ్య ప్రసూతి సెలవులో ఉన్నందున ఆమె స్థానంలో వెంటనే ఇన్‌చార్జిని నియమించాలని గోపీప్రసాద్‌ కోరారు. రెండు మూడు రోజుల్లో నియామకం జరుగుతుం దని కమిషనర్‌ తెలిపారు. అజెండాలోని ఐదు అంశాలకు సభ్యుల సూచన మేరకు రెండు అంశాలను వాయిదా వేశారు. సమావేశంలో కమిషనర్‌ ఎం.అంజయ్య, టీడీపీ ఏసుబాబు, మేనేజర్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ ఇలియాస్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్రరావు పాల్గొన్నారు.Updated Date - 2021-10-31T06:28:50+05:30 IST