తెలుగు తమ్ముళ్ల ఆగ్రహజ్వాల

ABN , First Publish Date - 2021-01-20T06:53:13+05:30 IST

మంత్రి కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు.

తెలుగు తమ్ముళ్ల ఆగ్రహజ్వాల
ఉమాను అరెస్టు చేసి, తరలిస్తున్న వాహనం ఎదుట టీడీపీ శ్రేణుల నిరసన

దేవినేని ఉమ అరెస్టుపై వెల్లువెత్తిన నిరసనలు

ఇబ్రహీంపట్నం పీఎస్‌ వద్ద నెట్టెం తదితరుల ఆందోళన

పమిడిముక్కలలో కొల్లు రవీంద్ర తదితరుల నిరసన

హనుమంతపురం క్రాస్‌రోడ్డు వద్ద శ్రీరాం తాతయ్య రాస్తారోకో

విజయవాడలో బుద్దా వెంకన్న సహా పలువురి హౌస్‌ అరెస్టు 

కొడాలి నానిపై టీడీపీ నేతల ఆగ్రహం


మంత్రి కొడాలి నాని చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును దుర్భాషలాడుతూ, బజారు రౌడీలా వ్యవహరించిన మంత్రిని అడ్డుకోవలసిన పోలీసులు గొల్లపూడి సెంటరులో శాంతియుత నిరసనకు దిగిన ఉమాను అరెస్టు చేయడమేమిటని మండిపడ్డారు. మంగళవారం ఉదయం గొల్లపూడిలో దేవినేని ఉమాను అరెస్ట్‌ చేసిన పోలీసులు రోజంతా పలు పోలీసుస్టేషన్లకు తిప్పి, సాయంత్రం విడుదల చేశారు. దీంతో ఉమాకు సంఘీభావంగా.. కొడాలి నాని తీరుకు నిరసగా తెలుగు తమ్ముళ్లు జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మంత్రి కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. మంగళవారం ఉదయం గొల్లపూడి సెంటరులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శాంతియుత నిరసనకు దిగారు. దీన్ని అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి పలు పోలీసుస్టేషన్లకు తిప్పి, సాయంత్రం విడుదల చేశారు. ఆయనకు సంఘీభావంగా.. కొడాలి నాని తీరుకు నిరసనగా తెలుగు తమ్ముళ్లు జిల్లావ్యాప్తంగా ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. పలువురు ముఖ్యనాయకులను ఆందోళనల్లో పాల్గొనకుండా పోలీసులు హౌస్‌ అరెస్టులు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, మాజీమంత్రి దేవినేని ఉమాను అసభ్యంగా తిడుతూ, రెచ్చగొట్టేలా మాట్లాడిన కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఉమాను అదుపులోకి తీసుకున్న పోలీసుల తీరుపైనా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


దేవినేని ఉమాను గొల్లపూడిలో అరెస్ట్‌ చేసిన పోలీసులు అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ పార్టీ నేతలు, కార్యకర్తలతో వచ్చి స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఉమాను అక్కడి నుంచి పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పెద్దసంఖ్యలో పమిడిముక్కల మండలం వీరంకిలాకు పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఉమాను తమకు చూపించాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. టీడీపీ  నాయకురాలు కేశినేని శ్వేత ఇతర మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసుస్టేషన్‌ లోపలకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులను నిలువరించిన పోలీసులు చివరికి కొద్దిమందిని మాత్రమే అనుమతించడంతో నెట్టెం రఘురామ్‌, కొల్లు రవీంద్ర, తంగిరాల సౌమ్య, బోడె ప్రసాద్‌ తదితరులు పోలీసుల నిర్బంధంలో ఉన్న ఉమాను కలిసి మాట్లాడి వచ్చారు.  


నానిపై టీడీపీ నేతలు ఫైర్‌

కొడాలి నాని తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బజారు రౌడీలా  బెదిరిస్తున్నా, కేసు నమోదు చేయలేని పోలీసులు శాంతియుతంగా దీక్ష చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాను అరెస్ట్‌ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. పోలీసులు ప్రభుత్వానికి బానిసలుగా మారారని, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాజీ మంత్రిని బెదిరిస్తున్నా, ఆయనపై కేసు పెట్టలేని వారిగా మారిపోయారని విమర్శించారు. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకుని ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.. మాజీ ఎంపీ కొనకళ్ల మాట్లాడుతూ.. కొడాలి నాని విశ్వాసఘాతకుడని దుయ్యబట్టారు. పమిముక్కల పీఎస్‌ నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమా విలేకరులతో మాట్లాడుతూ.. చదువూ సంధ్యలేని వారు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే ఎలా ఉంటుందో వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు రుజువు చేస్తున్నారన్నారు. నాని పశువు కన్నా హీనమైనవాడని, అలాంటి వ్యక్తితో చర్చించే స్థాయి తనది కాదన్నారు.


నిరసనల హోరు

ఉమా అరెస్టుకు నిరసనగా బందరులో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. మాజీమంత్రి దేవినేని ఉమాను పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పమిడిముక్కల మండలం హనుమంతపురం క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించి, నిరసన తెలిపారు. మాజీమంత్రి దేవినేని ఉమాకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావును పోలీసులు అడ్డుకుని, హౌస్‌ అరెస్టు చేశారు. మాజీ కార్పొరేటర్‌ యేదుపాటి రామయ్య తదితర ద్వితీయశ్రేణి నాయకులను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. Updated Date - 2021-01-20T06:53:13+05:30 IST