రైతులను దొంగల్లా చూసిన ఏకైన ప్రభుత్వం వైసీపీ: కూన రవి
ABN , First Publish Date - 2021-11-03T19:34:40+05:30 IST
దేశంలోరైతులను దొంగల్లా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: దేశంలో రైతులను దొంగల్లా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థికు రైతులే వెన్నెముక అని... జగన్ ఆ వెన్నెముక లేకుండా చేస్తున్నారన్నారు. భూగర్భ జలాలు పెంపొందించి కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు నీరు-చెట్టుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్ జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేశారని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ కాంట్రాక్టర్లు, బినామీల పేర్లతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులున్నారన్న జగన్ 40 వేల మందికే రైతు భరోసా ఇస్తున్నారని తెలిపారు. నీరు-చెట్టు పనులు చేసిన రైతులకు టీడీపీ ముద్ర వేసి రూ.1700 కోట్లు ఇవ్వకుండా జగన్ రెడ్డి రైతుల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని నీరుచెట్టు ద్వారా రూ.4851 కోట్లతో 7 లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకంచామన్నారు. ‘‘జగన్ రెండున్నరేళ్లలో ఒక్క చెక్ డ్యాం అయినా నిర్మించారా?..ఒక్క చెరువులోనైనా తట్టెడు మట్టి తీసారా?... ఒక్క ఎకరాకు అయినా ఆయకట్టు స్థిరీకంచారా?’’ అంటూ కూన రవికుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.