నివర్‌ తుఫాన్‌ స్వాహాపై సర్వే

ABN , First Publish Date - 2021-10-22T05:11:24+05:30 IST

నివర్‌ తుఫాన్‌ స్వాహాపై సర్వే

నివర్‌ తుఫాన్‌ స్వాహాపై సర్వే
రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు

మైలవరం రూరల్‌, అక్టోబరు 21 : నివర్‌ తుఫాన్‌ నిధుల స్వాహాపై జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు అధికారులు గురువారం పుల్లూరు పంచాయతీలో విచారణ ప్రారంభించారు. ఏవో, డీటీ, సర్వేయర్‌, వీఆర్వో, వీవోఏలతో కూడిన అధికార బృందం మొత్తం 10 బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచి రైతుల వివరాలు తెలుసుకున్నారు. పుల్లూరు, బాడవ, దాసుళ్లపాలెం, కొత్తగూడెం, చిలుకూరువారిగూడెం, పుల్లూరు తండా, కొత్త మంగాపురం గ్రామాల్లో పర్యటించారు. సర్వే నెంబర్ల ఆధారంగా ఏ రైతు, ఏ పంట సాగు చేశాడు, నష్టపోయింది నిజమా, కాదా, ఎంత నగదు జమ అయ్యిందనే కోణంలో సర్వే చేస్తున్నారు. ఏడీఏ వెంకటేశ్వరరావు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం తహసీల్దార్లు ముత్యాల శ్రీనివాస్‌, సూర్యారావు అధికారుల బృందాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాగా, నివర్‌ తుఫాన్‌ నష్టం పేరుతో రూ.కోట్లు దోచుకున్న నాయకులు తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే వందల్లో దొంగ పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం కూడా విచారణ జరుగుతుంది. 

Updated Date - 2021-10-22T05:11:24+05:30 IST