ప్రైవేటు బ్యాంకులను నమ్మొద్దు : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-03-14T05:44:52+05:30 IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రమే ప్రజలు డిపాజిట్లు చేసుకోవాలని, ప్రైవేటు బ్యాంకులు, సొసైటీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు.

ప్రైవేటు బ్యాంకులను నమ్మొద్దు :  డీఎస్పీ

నూజివీడు టౌన్‌, మార్చి13: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రమే ప్రజలు డిపాజిట్లు చేసుకోవాలని, ప్రైవేటు బ్యాంకులు, సొసైటీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ నూజివీడు పట్టణంలోని అమరావతి క్యాపిటల్‌ మ్యూచివల్‌ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ సంస్థలో కొందరు ఖాతాదారులు డిపాజిట్లు చేసిన సొమ్మును మెచ్యూరిటీ తీరినప్పటికీ ఆ సంస్థ తిరిగి చెల్లించకపోవడంతో ఖాతాదారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. అధిక వడ్డీలకు ఆశపడి చేసిన డిపాజిట్లు తిరిగి ఇవ్వకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నూజివీడు, విస్సన్నపేట తదితర ప్రాంతాల్లో ఈ సంస్థలో డిపాజిట్లు చేసిన ఖాతాదారులు ఆ సంస్థ తిరిగి నగదును చెల్లించకపోవడంతో మోసపోయినట్లు తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నగదును డిపాజిట్‌ చేయడం ద్వారా భద్రత ఉంటుందని, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే ముందు, ఆ బ్యాంకులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. కష్టపడి పనిచేసి అధిక వడ్డీలకు ఆశపడి తమ సొమ్మును వృథా చేసుకోవద్దన్నారు. ఖాతాదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.  

  సొసైటీ డిపాజిటర్లకు న్యాయం చేయాలి 

విస్సన్నపేట : విజయవాడ కేంద్రంగా నడుస్తున్న అమరా వతి కేపిటల్‌ మ్యూచివల్‌ ఎయిడెడ్‌ మల్టీ పర్పస్‌ కో.ఆపరేటివ్‌ సొసైటీ డిపాజిటర్లకు న్యాయం చేయాలని బాధిత ఖాతాదారులు శనివారం విస్సన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిరు వ్యాపారాలు సాగిస్తూ తమ అవసరాలకు ఉపయోగిం చుకుందామనే ఆలోచనతో అమరావతి సొసైటీలో తమ డబ్డును దాచుకున్నామని, సొసైటీ వారు తమను నిలువునా ముంచారని బాధితులు వాపోయారు.  తమ డిపాజిట్‌ సొమ్మును వెంటనే చెల్లించాలని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నిరసన తెలిపారు. అమరావతి సొసైటీ బ్యాంకు ఖాతాలకు చెందిన ఆధారాలతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్సై బాధిత ఖాతాదారులకు తెలిపారు. స్వీకరించిన ఫిర్యాదులతో నూజివీడు పీఎస్‌లో కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.  

Updated Date - 2021-03-14T05:44:52+05:30 IST