ప్రజల సహకారంతో ప్రశాంత ఎన్నికలు: ఎస్పీ

ABN , First Publish Date - 2021-02-06T06:21:17+05:30 IST

ప్రజల సహకారంతో ప్రశాంత ఎన్నికలు: ఎస్పీ

ప్రజల సహకారంతో ప్రశాంత ఎన్నికలు: ఎస్పీ
జొన్నపాడులో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

గుడివాడ(రాజేంద్రనగర్‌), ఫిబ్రవరి 5: ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు కోరారు. గుడివాడ డివిజన్‌లోని అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఆయన శుక్రవారం డీఎస్పీ సత్యానందంతో కలిసి పరిశీలించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతినకుండా ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తొలి దశ ఎన్నికల్లో 80 అతి సమస్యాత్మక, 112  సమస్యాత్మక, 158 సాధారణ గ్రామాల్లో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామాల్లో పోలీసు కవాతు, ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించామన్నారు. నూరు శాతం పోలింగ్‌ జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. 5 వేల లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని 25 మందిని అరెస్టు చేశామన్నారు. 

నిష్పక్షపాతంగా వ్యవహరించండి

నందివాడరూరల్‌(గుడివాడ): పంచాయతీ ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశించారు. మండలంలోని జొన్నపాడులో శుక్రవారం ఆయన పర్యటించారు. పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, బందోబస్తు, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేవారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తి చేయాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆవరణలోనూ కాంపౌండ్‌ వాల్‌ లేని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ బృందాల సేవలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ సత్యానందం, సీఐ అబ్దుల్‌నబీ, ఎస్సై చిరంజీవి పాల్గొన్నారు. 

కట్టుదిట్టంగా ఎన్నికల బందోబస్తు 

పామర్రు: గ్రామాల్లో నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు అన్నారు. సమస్యాత్యక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించిన పామర్రు, బల్లిపర్రు, కొమరవోలు, జఝ్జవరం గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎస్సై స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. మద్యం అక్రమ రవాణా జరగకుండా  డీఎస్పీ పి.సత్యానందం, సీఐ జి.కిషోర్‌బాబు, ఎస్సై జి.శ్రీహరిబాబు, ఎంఎస్‌కేలు సింహాద్రి సునీత, లత, వీఆర్వో రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.




Updated Date - 2021-02-06T06:21:17+05:30 IST