సార్టెక్స్ బియ్యం.. పక్కదారి
ABN , First Publish Date - 2021-04-25T05:47:26+05:30 IST
సార్టెక్స్ బియ్యం.. పక్కదారి
జిల్లాలో భారీగా సార్టెక్స్ బియ్యం అక్రమ తరలింపు
బందరులో చీకటి వ్యాపారికి జిల్లా బహిష్కారం
తాజాగా కంచికచర్లలో భారీగా పట్టివేత
చేతులెత్తేసిన సివిల్ సప్లయిస్ అధికారులు
రంగంలోకి పోలీస్ విజిలెన్స్ బృందం
ఎండీయూ ఆపరేటర్ల ద్వారానే చీకటి వ్యాపారుల కొనుగోళ్లు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : ‘సార్టెక్స్ బియ్యం నాణ్యమైనవి. మధ్య స్వర్ణరకానికి చెందినవి. ఏ కార్డుదారుడూ ఈ బియ్యాన్ని అమ్ముకోలేడు.’ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) డోర్ డెలివరీ ప్రారంభం సందర్భంగా జిల్లా యంత్రాంగం చెప్పిన మాట ఇది. ప్రజలు తినటానికి వదులుకోరని చెప్పిన బియ్యం కూడా జిల్లాలో భారీగా బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది. సార్టెక్స్ బియ్యం ద్వారా అధికంగా సంపాదించవచ్చన్న కారణంతో అక్రమార్కులు ఏకంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లతోనే వ్యవహారాలు సాగిస్తున్నారు. బందరులో విజిలెన్స్‌కు పట్టుబడిన చీకటి డాన్ ఎండీయూ ఆపరేటర్ల నుంచే సార్టెక్స్ బియ్యాన్ని సేకరించడం ఇందుకు ఊతమిస్తోంది.
అక్రమాలు ఎన్నో..
సార్టెక్ ్స బియ్యం నిల్వలకు సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కార్డుదారులకు బియ్యం ఇచ్చిన తర్వాత వారి నుంచి ఎండీయూ ఆపరేటర్లే రూ.8కు కొనుగోలు చేస్తున్నారు. గతంలో రేషన్ డీలర్లు అయితే రూ.5కే కొనేవారు. ఇలా కొన్న బియ్యాన్ని చీకటి వ్యాపారులకు వీరు రూ.12 నుంచి రూ.15కు విక్రయిస్తున్నారు. చీకటి వ్యాపారులేమో రూ.25కు ట్రేడర్లు, మిల్లర్లకు విక్రయిస్తున్నారు. బడా చీకటి వ్యాపారులైతే తామే సొంతంగా జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. కానీ, ఎండీయూ ఆపరేటర్లపై మాత్రం సివిల్ సప్లయిస్ విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచట్లేదు. ఎండీయూ ఆపరేటర్లు ప్రతినెలా రేషన్ డిపోల నుంచి సరకును తీసుకోవాలి. ఈ సరకును గుత్తంగా వ్యాపారులకు తరలించి, వారి దగ్గర నుంచి నాసిరకం బియ్యం తీసుకుని ప్రజలకు పంపిణీ చేస్తున్న ఉదంతాలు కూడా పోలీస్ విజిలెన్స్ విభాగం దృష్టికి వచ్చాయి. ఎంఎల్‌ఎస్ స్టాక్ పాయింట్ల నుంచి చౌక దుకాణ డీలర్లకు ప్రత్యేకంగా సీలు వేసిన సంచుల్లో సార్టెక్స్ బియ్యం వస్తోంది. ఇదే సీలు వేసిన బస్తాలు ఎండీయూ ఆపరేటర్ తన వాహనంలో ఇంటింటికీ తీసుకెళ్తున్నాడా, లేదా అనే పర్యవేక్షణ కొరవడింది. దీనివల్ల మంచి రకం బియ్యం బ్లాక్ మార్కెట్‌కు పోయి, నాసిరకం పేదలకు చేరుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
చీకటి వ్యాపారులెందరో..
సార్టెక్స్ బియ్యాన్ని సేకరించి భారీగా సొమ్ము చేసుకుంటున్న బడా చీకటి వ్యాపారులు పదిమందికి పైగానే ఉన్నారు. తూర్పు కృష్ణాలో బందరు కేంద్రంగా ఓ చీకటి వ్యాపారి అక్రమ వ్యాపారానికి తెరతీశాడు. ఆయన లీలలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించగా, పోలీస్ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో ఆయనపై కలెక్టర్ ఇంతియాజ్ జిల్లా బహిష్కారం విధించారు. ఇక పశ్చిమ కృష్ణాలో మరో డాన్‌పై దాడులు చేయటానికి సివిల్ సప్లయిస్ విజిలెన్స్ విభాగం వణికిపోతోంది. ఇక నియోజకవర్గానికో చీకటి వ్యాపారి ఉన్నాడు. వీరికి సివిల్ సప్లయిస్ అధికారులే అండదండలు అందిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పోలీస్ విజిలెన్స్ విభాగం దీనిపై దృష్టిపెట్టింది.
ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి..
ప్రతి నియోజకవర్గం పరిఽధిలో ఉండే ఎంఎల్‌ఎస్ స్టాక్ పాయింట్ల నుంచి కూడా అక్రమంగా పేదల బియ్యం తరలిపోతోంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి చౌక దుకాణ డీలర్లకు ఇచ్చే బియ్యం తూకం ఉండదు. కొంత తరుగుతో డీలర్లకు ఇస్తారు. ఇలా డీలర్ల దగ్గర నుంచి తీసుకున్న తరుగును బల్క్‌గా చీకటి వ్యాపారులకు అమ్మేస్తుంటారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కూడా కాటా పద్ధతిన డీలర్లకు నిత్యావసరాలను పంపిణీ చేస్తే, ఈ మోసానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
అక్రమాల్లోనూ రీసైక్లింగ్
అక్రమ వ్యాపారులు కొందరిపై దాడులు చేసి పట్టుకున్న బియ్యాన్ని సివిల్ సప్లయిస్ అధికారులు వేలం వేస్తున్నారు. ఇలా వేలం వే సిన బియ్యాన్ని అదే చీకటి వ్యాపారులు మళ్లీ కొంటున్నారు. ఇలా అక్రమ బియ్యాన్ని వేలం వేసే బదులు ఆ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ స్టాకుగా ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై రాయితీ భారం తగ్గుతుంది. ఇలా వేలం వేయటం ద్వారా చీకటి వ్యాపారులే బినామీ పేర్లతో కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు.
