మహిళలకు సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలి
ABN , First Publish Date - 2021-12-31T05:22:24+05:30 IST
మహిళలకు సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలి

‘చీప్’ వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళా సంఘాలు
గవర్నర్‌పేట, డిసెంబరు 30 : ఏపీలో అధికారం అప్పగిస్తే పేదలకు రూ.50కే చీప్ లిక్కర్ అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడంపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ గురువారం సాయంత్రం మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు లెనిన్ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేసి, సోము వీర్రాజు చిత్రపటాలను దహనం చేశారు. వీర్రాజు తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో విఫలమైన బీజేపీ చీప్ లిక్కర్ ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ మద్యం తక్కువ ధరకే అందిస్తామని చెప్పడం బాధాకరమన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఓవైపు మహిళలు సంపూర్ణ మద్య నిషేధాన్ని డిమాండ్ చేస్తుంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి.పద్మ, సమాఖ్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, జిల్లా కార్యదర్శి పి.రాణి, శ్రామిక మహిళా విభాగం కార్యదర్శి సుబ్బరావమ్మ, మాజీ కార్పొరేటర్లు సరోజ, ఆదిలక్ష్మి, వివిధ మహిళా సంఘాల నేతలు డి.సీతారావమ్మ, దుర్గాసి రమణమ్మ, బీను శాంతమ్మ, నార్ల మాలతి, కె.దుర్గ, అమలశ్రీ, మద్య నిషేధ పోరాట కమిటీ ప్రతినిధి మోతుకూరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.