Durga Temple: ఆమె వచ్చేశారు!

ABN , First Publish Date - 2021-07-12T16:15:18+05:30 IST

‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే..

Durga Temple: ఆమె వచ్చేశారు!
పాలకమండలి సభ్యురాలి హోదాలో పూజలో పాల్గొన్న నాగ వెంకట వరలక్ష్మి(చైర్మన్ సోమినాయుడు పక్కన కూర్చున్న మూడో మహిళ)

దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి హోదాలో చక్కా నాగ వెంకట వరలక్ష్మి 

నిజమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనం 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే నిజమైంది. మద్యం అక్రమ రవాణా కేసులో ఎదురైన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి పదవికి రాజీనామా చేసిన చక్కా నాగ వెంకట వరలక్ష్మి ఆదివారం మళ్లీ పాలక మండలి సభ్యురాలి హోదాలో ఆలయానికి వచ్చేశారు. 9 నెలల తర్వాత ఆమె మళ్లీ ఛైర్మన్‌, ఇతర సభ్యులతో కలిసి ఆలయంలో ప్రారంభమైన అమ్మవారికి ఆషాడ సారె సమర్పణ, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ‘పాలక మండలిలో ఆమెకు మళ్లీ చోటు’ శీర్షికతో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే.


గత ఏడాది సెప్టెంబరు 30న నాగ వెంకట వరలక్ష్మి సొంత కారులో అక్రమ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని ఆమె వివరణ ఇచ్చారు. అయితే నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయగా చైౖర్మన్‌ పైలా ఆమోదించారు. అప్పటి నుంచి పదవి ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలోనే తన పదవి తనకు కావాలంటూ గత నెల ఒకటిన చైౖర్మన్‌ సోమినాయుడుకి ఆమె లేఖ రాశారు. అక్రమ మద్యం కేసులో తన ప్రమేయం లేనందున తనను కొనసాగించాలని మంత్రి ద్వారా మంత్రాంగం నడిపి ఆదివారం పదవిలోకి వచ్చారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఆమెను ట్రస్టుబోర్డులో మళ్లీ నియమించినట్టుగా ఎలాంటి నియామక పత్రాలు ఇవ్వకుండానే పాలకమండలి సభ్యురాలి హోదాలో ఆలయ కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది.


ఆమెను చట్టపరంగా తొలగించలేదు: దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు  

అక్రమ మద్యం కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో చక్కా నాగ వెంకట వరలక్ష్మి పేరు లేదు. అయినా తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. ఆ రాజీనామాను తమ పాలకమండలి ఆమోదించినా దేవదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రభుత్వం చట్టపరంగా ఆమెను పదవి నుంచి తొలగించలేదు. ఈ నేపథ్యంలో అక్రమ మద్యం కేసులో తన ప్రమేయం లేనందున మళ్లీ తనను పాలకమండలి సభ్యురాలిగా కొనసాగించాలని మంత్రి, పాలకమండలిని ఆమె అభ్యర్థించారు. ప్రభుత్వం చట్టపరంగా ఆమెను తొలగించనందున ఆమె అభ్యర్థనను మన్నిస్తూ పాలకమండలి సభ్యురాలిగా కొనసాగాలని చెప్పాం. 

Updated Date - 2021-07-12T16:15:18+05:30 IST