జడ్‌ఎక్స్‌ఇన్‌లో ఎవరి వాటా ఎంత?

ABN , First Publish Date - 2021-08-25T06:23:14+05:30 IST

జడ్‌ఎక్స్‌ఇన్‌ సిలిండర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కరణం రాహుల్‌ పెట్టుబడి ఎంత?

జడ్‌ఎక్స్‌ఇన్‌లో  ఎవరి వాటా ఎంత?

వివరాలు సేకరిస్తున్న దర్యాప్తు బృందాలు

కోరాడ నుంచి వాయిస్‌ రికార్డులు స్వాధీనం

రాహుల్‌ సూచనతోనే కోరాడ ఫౌండేషన్‌!


జడ్‌ఎక్స్‌ఇన్‌ సిలిండర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కరణం రాహుల్‌ పెట్టుబడి ఎంత? అతడిని అంతమొందించిన కోరాడ విజయ్‌కుమార్‌ పెట్టుబడి ఎంత? కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమైన ఏడాది తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన మరో ఇద్దరు భాగస్వాములు ఎవరు? పోలీసుల ముందున్న ప్రశ్నలివి. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : రాహుల్‌ హత్య కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులకు వారు చెబుతున్న సమాధానాలతో కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. కోరాడ విజయ్‌కుమార్‌, కోగంటి సత్యం కలిసి కారుచౌకగా కంపెనీని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారని ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో రాహుల్‌ నడిపిన ఆర్థిక లావాదేవీలపైనా పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ ఏర్పాటు చేసిన జడ్‌ఎక్స్‌ఇన్‌ కంపెనీలో కోరాడ విజయ్‌కుమార్‌  తొలుత రూ.18.50కోట్లు, ఆ తర్వాత రూ.2.50కోట్లు పెట్టుబడి పెట్టినట్టు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అదే సమయంలో కంపెనీలో కోరాడ వాటా రూ.6కోట్లు మాత్రమే అని కొందరు చెబుతున్నారు. 

కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత మూడు కార్లు కొనుగోలు చేశారు. ఆ మూడు కార్లకు సంబంధించిన ఖర్చులను మొత్తం కంపెనీ నిధుల నుంచే తీసుకున్నట్టు తెలిసింది.  రాహుల్‌ తన ఇంట్లోనే ఒక గదిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. దీనికి నెలకు రూ.50వేలు అద్దె తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీకి రాహుల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌. నెలకు రూ.5లక్షలను వేతనంగా తీసుకునేవాడని సమాచారం. రాహుల్‌ ఫ్యాక్టరీని రూ.60 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. దాన్ని కోగంటి సత్యం రూ.25 కోట్లకు అడగాలనుకున్నాడు. కోరాడ పెట్టుబడిని మినహాయిస్తే  రాహుల్‌ వాటా ఎంత అన్న విషయాన్ని తేల్చే పనిలో ఒక బృందం ఉంది. రాహుల్‌ - కోరాడ, రాఘవరావు - కోరాడల మధ్య జరిగిన సంభాషణల వాయిస్‌ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.


బోర్టు మీటింగ్‌ ఎన్నిసార్లు జరిగింది?

సాధారణంగా ఒక కంపెనీ ఏర్పాటు చేస్తే  అందులో భాగస్వాములంతా సభ్యులుగా ఉంటారు. వాళ్లంతా కలిసి ఒక బోర్డుగా ఏర్పడతారు. వారు పెట్టిన పెట్టుబడిన బట్టి హోదాలు తీసుకుంటారు. జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో రాహుల్‌ ఏర్పాటు చేసిన జడ్‌ఎక్స్‌ఇన్‌ కంపెనీకి అతడే ఎండీ. కోరాడ విజయ్‌కుమార్‌ డైరెక్టర్‌. కంపెనీ ఏర్పాటైన ఏడాది తర్వాత వాటాల శాతం తగ్గింది. ఇది కాకుండా కొత్తగా ఇద్దరు భాగస్వాములు పది శాతం వాటాతో వచ్చారు. కంపెనీ ఏర్పాటు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారీ బోర్డు మీటింగ్‌ జరగలేదని కంపెనీలోని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సమావేశం జరగకపోయినా జరిగినట్టు కొన్ని తీర్మానాలు చేసినట్టు మినిట్స్‌ పుస్తకంలో రాశారు. బోర్డులో సభ్యులంతా ఈ పుస్తకంలో సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో కోరాడ విజయ్‌కుమార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశారని సమాచారం. ఈ విషయాలను విచారణలో కోరాడ వెల్లడించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.  


‘ఫౌండేషన్‌’ ఆలోచన రాహుల్‌దేనా?

2019 ఎన్నికలకు ముందు కోరాడ విజయ్‌కుమార్‌ ‘కోరాడ ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. ఈ ఆలోచన రాహుల్‌దేననికొందరు చెబుతున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తూనే రాజకీయాల్లో ఎదగడానికి అవకాశం ఉంటుందని రాహుల్‌ సలహా ఇచ్చినట్టు సమాచారం. దీంతో 2019 ఎన్నికల ముందు కోరాడ ఫౌండేషన్‌ను వెలుగులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా పశ్చిమ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కోరాడ అటు వైసీపీ నుంచి, ఇటు జనసేన నుంచి టికెట్‌ ఆశించాడు. రెండు పార్టీల్లోనూ దారులు మూసుకుపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు.

Updated Date - 2021-08-25T06:23:14+05:30 IST