నిఘా తప్పిందా?

ABN , First Publish Date - 2021-02-05T06:33:32+05:30 IST

నిఘా సమాచారం గురి తప్పుతోందా?..

నిఘా తప్పిందా?
గురునానక్‌ కాలనీలో పట్టాభిపై దాడి జరిగిన ప్రాంతమిదే..

పట్టాభిపై దాడి ఘటనతో పోలీస్‌ శాఖలో అంతర్మథనం


విజయవాడ, ఆంధ్రజ్యోతి: నగరంలో నిఘా సమాచారం గురి తప్పుతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ఏర్పడిన పరిస్థితులు నిఘా వర్గాలకు అంతుబట్టడం లేదా? ఒకసారి దాడి జరిగిన తర్వాత రెండోసారి ఆ అవకాశం లేదని తేలిగ్గా తీసుకున్నారా? టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై దాడి జరిగాక ఉదయిస్తున్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలపై పోలీస్‌ శాఖలో చర్చ నడుస్తోంది. 


విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో జరిగే కార్యకలాపాలకు సంబంధించి స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌ వర్గాలు పనిచేస్తుంటాయి. ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు జరిగినా ఎప్పటికప్పుడు సమాచారం ఆయా విభాగాల అధికారులకు చేరిపోతుంది. ఏయే పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా సమాచారం ఉన్నతాధికారులకు చేరుతుంది. అటువంటిది కొమ్మారెడ్డి పట్టాభిపై దాడి జరిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం నిఘా వర్గాలకు చేరలేదా? అన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. పట్టాభిపై మూడు రోజుల క్రితం గుర్తుతెలియని యువకులు దాడి చేశారు. ఆ తర్వాత పోలీస్‌ ఉన్నతాధికారులు నిఘా వర్గాల అధికారులతో సమావేశమయ్యారు. పట్టాభిపై దాడి జరగడం ఇది రెండోసారి. గడిచిన ఏడాది ఆయన ఇంటి వద్ద బయట పార్క్‌ చేసిన కారును దుండగులు ధ్వంసం చేశారు. ఈ కేసులో నిందితులు ఎవరన్నది నిర్ధారణ కాలేదు.


తాజాగా ఇంటి నుంచి కారులో బయటకు వెళ్తుండగా, కర్రలతో దాడి చేశారు. వాస్తవానికి తొలి దాడి జరిగిన తర్వాత నుంచి పట్టాభి ప్రభుత్వ విధానాలపై మరింతగా ఒంటికాలిపై లేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్పన్నమయ్యే పరిణామాలను స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు అంచనా వేయలేకపోయారన్న విమర్శ వినిపిస్తోంది. దాడి జరిగిన రోజున ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు బ్లూకోట్స్‌ పోలీసులు అదే ప్రాంతంలో తిరిగారు. అప్పటికే పట్టాభి ఇంటి ముందున్న షటిల్‌ కోర్టు వద్ద బల్లలపై యువకులు కూర్చుని ఉన్నారు. వారంతా స్థానికులే అన్న భావనలో బ్లూకోట్స్‌ పోలీసులు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దాడి జరిగాక పోలీసులకు మీడియా ద్వారానే సమాచారం అందింది. స్థానికుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. సాధారణంగా పోలీసులు, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ఎక్కడ ఏం జరిగినా సమాచారం ఇవ్వడం కోసం కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు.


ప్రశాంతంగా ఉండే వివేకానందనగర్‌ కాలనీలో ఈ వ్యవస్థను పోలీసులు ఏర్పాటు చేసుకోలేదా? ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ సమాచారం ఇవ్వలేకపోయిందా? అన్నది మరో ప్రశ్న. స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులతో నగర పోలీస్‌ అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. దాడి జరిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనా ఎందుకు అందలేదన్న దానిపై ప్రశ్నించారు. దీనికి స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. డీసీపీ హర్షవర్థన్‌ను పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసులు తన కార్యాలయానికి గురువారం పిలిపించుకుని సమావేశమయ్యారు. ఈ కేసు పురోగతి, దర్యాప్తు తీరును అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. 


వారెవరు?

పట్టాభి కారులో వెళ్తుండగా మొత్తం తొమ్మిది మంది యువకులు కర్రలతో దాడి చేశారు. వారిలో ఎక్కువ మంది మాస్కులు ధరించి ఉండడం వల్ల ముఖాలను గుర్తుపట్టడం కష్టంగా మారింది. ముగ్గురు యువకుల ముఖాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా వారి ఫొటోలను పోలీసులు తీశారు. ఇప్పుడు ఆ ముగ్గురు యువకులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆ ఫొటోలను వివేకానంద నగర్‌లో ఉన్న వారికి చూపించి ఆరా తీశారు. వారిని ఇంతకు ముందెన్నడూ చూడలేదని వారు చెప్పారు.Updated Date - 2021-02-05T06:33:32+05:30 IST