నిధుల మళ్లింపు దుర్మార్గం
ABN , First Publish Date - 2021-11-28T05:53:14+05:30 IST
నిధుల మళ్లింపు దుర్మార్గం

ప్రభుత్వ చర్యలతో సర్పంచ్ల వ్యవస్థ నిర్వీర్యం
గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపిన ఆగిరిపల్లి సర్పంచ్
ఆగిరిపల్లి, నవంబరు 27: సమస్యలతో కునారిల్లుతున్న గ్రామ పంచాయతీలను మరింత అంధకారంలోకి నెట్టేలా ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించడం దుర్మార్గపు చర్య అని సర్పంచ్ చవటపల్లి లక్ష్మి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శనివారం గాంధీ విగ్రహం ఎదుట నిధుల మళ్లింపుపై పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలసి ఆమె నిరసన తెలిపారు. పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు దారి మళ్లించడం సర్పంచ్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అవుతుందని ఆమె స్పష్టం చేశారు. నిధులను పక్కదారికి మళ్లించి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయకుండా సర్పంచ్లను ప్రజాకోర్టులో దోషులుగా ప్రభుత్వం నిలబెట్టిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో భార్గవికి వినతిపత్రాన్ని సమర్పించారు. సీపీఎం మండల నాయకులు నిరసనకు సంఘీభావం తెలిపారు. రాయల సాంబశివరావు, యెండూరు ప్రణీత్, సత్తు కోటేశ్వరరావు, సుభాని తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఖాతాలకే నిధులు మళ్లించాలి
గంపలగూడెం: 14, 15వ ఆర్థిక సంఘం నిధులను తిరిగి పంచాయతీ ఖాతాలకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు గంపలగూడెం, పెదకొమెర, సొబ్బాల, లింగాల గ్రామాల టీడీపీ సర్పంచ్లు కోట పుల్లమ్మ, వేముల కస్తూరి, ఉన్నం కృష్ణారావు, కీసర వేణుగోపాలరెడ్డిలు ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డికి శనివారం వినతిపత్రం అందించారు. కనీస నిధులు లేకపోవడంతో విద్యుత్, శానిటేషన్, తాగునీరు, మౌలిక అవసరాలను తీర్చడం సాధ్యమవడం లేదన్నారు.
