చెంతనే ఇసుక.. అయినా చేతికందక..!

ABN , First Publish Date - 2021-08-21T05:25:54+05:30 IST

చెంతనే ఇసుక.. అయినా చేతికందక..!

చెంతనే ఇసుక.. అయినా చేతికందక..!
వల్లూరుపాలెం ఇసుక స్టాక్‌యార్డు

అధికారుల నిర్ణయాలు.. ప్రజలకు శాపాలు

ఇసుక సరఫరాలో స్థానికులకు ఇక్కట్లు

మచిలీపట్నం రూట్‌లో కనుమూరు ఇసుక యార్డు

కరకట్ట వెంట వల్లూరుపాలెంలో మరో యార్డు

వీటిని వదిలి ఇబ్రహీంపట్నం వెళ్లాలంట..!

వినియోగదారులపై రవాణా ఖర్చుల భారం

తోట్లవల్లూరు, ఆగస్టు 20 : చెంతనే ఇసుక ఉన్నా చేతికందని పరిస్థితి ఏర్పడింది. ముంగిట్లో ఉన్న యార్డుల్లో ప్రజలు ఇసుక పొందలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం జేపీ కంపెనీకి ఇసుక విక్రయాల నిర్వహణను అప్పగించింది. ఇసుక కావాలంటే సదరు కంపెనీ సూచిం చిన ప్రాంతానికి వెళ్లక తప్పట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పక్కనే ఉన్నా..

వల్లూరుపాలెం, రొయ్యూరు, కనుమూరు గ్రామాల్లో జేపీ కంపెనీ ఇసుక యార్డులను ఏర్పాటు చేసింది. రొయ్యూరులో ప్రభుత్వ పనులకు, జగనన్న ఇళ్లకే ఇసుకను అందిస్తున్నారు. వల్లూరుపాలెంలో ప్రజలకు విక్రయిస్తుంటే నిలుపుదల చేశారు. కనుమూరు యార్డులో అయితే విక్రయాలే చేపట్టలేదని డ్రైవర్లు చెబుతున్నారు. కనుమూరు యార్డు మచిలీపట్నం రూటులో ఉంది. ఇది పామర్రు, గుడివాడ, మచిలీపట్నం      తదితర ప్రాంతాల ప్రజలకు దగ్గర. కనుమూరు యార్డును కాదని నిన్నటివరకు వల్లూరుపాలెం యార్డుకు ఇసుకను పంపించారు. ఇప్పుడు వల్లూరుపాలెంలో నిలిపివేసి విజయవాడ అవతల ఇబ్రహీంపట్నం యార్డుకు వెళ్లాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. మచిలీపట్నం         ప్రజలకు కనుమూరు సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇబ్రహీంపట్నం అయితే 80 కిలోమీటర్లు ఉంటుంది. కనుమూరు యార్డులో విక్రయాలు లేకుండా చేసి 80 కిలోమీటర్ల దూరాన ఉన్న ఇబ్రహీంపట్నం యార్డుకు వెళ్లాలంటే రవాణా చార్జీలు భారీగా పెరుగుతాయి. కనీసం వల్లూరుపాలెం అయినా దగ్గరగానే ఉంటుంది. కనుమూరు యార్డుకు ఎందుకు తెరవలేదో ప్రశ్నించేవారు లేరు. ఇప్పటికే టన్ను ఇసుకను రూ.620గా నిర్ణయించి అమ్ముతున్నారు. దీనికితోడు రవాణా భారం ప్రజలకు కన్నీరు తెప్పిస్తోంది. అధికారులైనా జేపీ కంపెనీతో మాట్లాడి అన్ని యార్డులను తెరిచి ఇసుక అందించేలా చర్యలు తీసుకుంటే మేలు కలుగుతుందని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-21T05:25:54+05:30 IST