గ్రామాలను అభివృద్ధి చేయండి

ABN , First Publish Date - 2021-08-25T06:09:02+05:30 IST

గ్రామాలను అభివృద్ధి చేయండి

గ్రామాలను అభివృద్ధి చేయండి
సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చిస్తున్న కొమ్మా కోట్లు, ఆర్‌వీఆర్‌, రంగారావు

  ప్రభుత్వ సలహాదారు సజ్జలకు రూరల్‌ వైసీపీ నేతల వినతి

విజయవాడ రూరల్‌, ఆగస్టు 24 :  మండలంలోని తొమ్మిది గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని గొల్లపూడి ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు) నేతృత్వంలోని వైసీపీ నేతల బృందం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కోరింది. విజయవాడ నగరం సరిహద్దులో ఈ తొమ్మిది గ్రామాలు ఉన్నాయని, అందువల్ల ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ మోహన్‌ సూచనల మేరకు  కొమ్మా కోట్లు ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వరరావు, నిడమానూరు సర్పంచ్‌ శీలం రంగారావు, రామవరప్పాడు సర్పంచ్‌ వరి శ్రీదేవి, పేరంటాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్‌ బోయిన భాను తదితరులు  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళవారం కలిశారు.  రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, నున్న, పాతపాడు, పీ నైనవరం, అంబాపురం గ్రామాలు విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్నాయని, అవన్నీ నేడు ముఖ ద్వారాలుగా ఉన్నట్లు తెలిపారు. విజయవాడ నగరంతోపాటు అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.  ఇదిలావుండగా, వైసీపీలో ఎప్పటి నుంచో అంకితభావంతో పని చేస్తున్న నాయకులను గుర్తించి పలు కార్పొరేషన్లకు నియమించనున్న డైరెక్టర్ల పదవులను కేటాయించాలని వారు కోరారు. ఈ అన్ని అంశాలపై సజ్జల రామకృష్ణారెడ్డి మండల నాయకులతో చర్చించిన అనంతరం మాట్లాడుతూ,  గ్రామాల అభివృద్ధి అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు. గ్రామాలకు ప్రాఽధాన్యంతోపాటు పార్టీలో అంకితభావంతో పని చేసేవారికి తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. సజ్జలను కలసిన వారిలో  దేవగిరి ఓంకార్‌రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి కె సువర్ణరాజు, సమ్మెట సాంబశివరావు ఉన్నారు. 

Updated Date - 2021-08-25T06:09:02+05:30 IST