కరోనాకాలంలో ఉద్యోగుల పనితీరు భేష్
ABN , First Publish Date - 2021-12-30T06:43:33+05:30 IST
కరోనాకాలంలో ఉద్యోగుల పనితీరు భేష్

ఆర్టీసీ పాలకవర్గ తొలి సమావేశంలో చర్చ
వన్‌టౌన్, డిసెంబరు 29 : కరోనా కష్టకాలంలో ఆర్టీసీ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమని ఆర్టీసీ పాలకవర్గం కొనియాడింది. ఆర్టీసీ హౌస్‌లో బుధవారం పాలకవర్గ తొలి సమావేశం జరిగింది. మొత్తం 45 అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రజా రవాణాలో విలీనం చేసినందు వల్ల జీతాలను ప్రభుత్వమే చెల్లించడం, ఫలితంగా సంస్థకు ఆర్థికంగా వచ్చిన వెసులుబాటుపై చర్చించారు. రానున్న కాలంలో సంస్థ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సభ్యులు సూచనలు చేశారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగులు బాగా పనిచేశారని, 322 మంది కరోనా బారినపడి మృతిచెందారని, అంతటి విపత్తులో కూడా ఉద్యోగులు పనిచేయడం ప్రశంసనీయమని వక్తలు కొనియాడారు. ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు, వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, వివిధ జోనళ్ల చైర్మన్లు గడాల బంగారమ్మ, తాతినేని పద్మావతి, సుప్రజ, మాల్యవంతం మంజుల, ప్రభుత్వ ప్రతినిధులు ఎస్‌ఎస్ రావత్, ఎంటీ కృష్ణబాబు, శశిభూషణ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పరేష్ కుమార్ గోయల్, కేవీఆర్‌కే ప్రసాద్, ఆర్‌ఆర్‌కే కిషోర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.