ఉపాధ్యాయులు పనితీరు మార్చుకోండి

ABN , First Publish Date - 2021-08-20T06:06:00+05:30 IST

నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ పనితీరు మార్చుకోవాలని పాఠశాల విద్యా శాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (కాకినాడ) ఆర్‌.నరసింహారావు స్పష్టం చేశారు.

ఉపాధ్యాయులు పనితీరు మార్చుకోండి

తోట్లవల్లూరు, ఆగస్టు 19 : నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ పనితీరు మార్చుకోవాలని పాఠశాల విద్యా శాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (కాకినాడ) ఆర్‌.నరసింహారావు స్పష్టం చేశారు. తోట్లవల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గదికి 20 మంది విద్యార్థులు కూర్చునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడాదిన్నరగా చదువుకు దూరం కావటం చేత విద్యార్థుల్లో కొంత వెనుకబాటు ఉంటుందని, అలాంటి పిల్లలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో చదువు చెప్పి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యేలా చూడాలన్నారు. నూతన విద్యా విధానమంటే పాఠశాలలను తొలగించటం కాదని, తరగతులను సర్దుబాటు చేస్తారన్నారు.  ఇందుకు ఉపాధ్యాయులు సమాయత్తం కావాలన్నారు. విద్యార్థులకు మార్కులే ప్రధానం కాదని, ఆటపాటల్లో రాణించే విధంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. విద్యార్థులను పరిపూర్ణంగా బయటకు పంపటమే నూతన విద్యా విధానం లక్ష్యమని, మార్పు చెందని ఉపాధ్యాయులను ఇక భరించలేమని ఆర్జేడీ స్పష్టం చేశారు. నూతన వార్షిక విద్యా ప్రణాళికను ప్రతి ఉపాధ్యాయుడు డౌన్‌లోడు చేసుకుని పూర్తిగా చదివి దాని ప్రకారం నెల రోజుల్లో మారాలని సూచించారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం మార్పు చెందకపోతే నష్టపోతామని హెచ్చరించారు. ముందుగా తరగతి గదులకు వెళ్లి విద్యార్ధులతో మాట్లాడారు.  కరోనాకు భయపడి ఎక్కడికి పోలేమని, తగిన జాగ్రత్తలతో వచ్చి చదువుకోవటంపైనే విద్యార్థులు శ్రద్ద చూపాలని ఆర్‌జేడీ అన్నారు. నాడు నేడు ఫేజ్‌-1 పనులను పరిశీలించారు. పనులు  పూర్తికాక పోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈవో జి వెంకటేశ్వరరావు, ప్రధానోపాద్యాయుడు లలితమోహన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వల్లూరుపాలెం ఉన్నత పాఠశాల, ఎంఈవో కార్యాలయాన్ని కూడా ఆర్జేడీ సందర్శించారు.

Updated Date - 2021-08-20T06:06:00+05:30 IST