సౌకర్యమే కీలకం

ABN , First Publish Date - 2021-12-08T06:41:15+05:30 IST

భవానీ దీక్షల విరమణ కోసం ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.

సౌకర్యమే కీలకం
భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను పరిశీలించి, ఈవోకు సూచనలిస్తున్న కలెక్టర్‌ నివాస్‌. పక్కన మంత్రి వెలంపల్లి తదితరులు

భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లపై సమీక్ష 


  విజయవాడ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : భవానీ దీక్షల విరమణ కోసం ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరగనున్న భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లపై కలెక్టర్‌ నివాస్‌, జాయింట్‌ కలెక్టర్లు, దుర్గగుడి, వీఎంసీ అధికారులతో కలిసి మంత్రి వెలంపల్లి మంగళవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఏడాది మాదిరిగానే కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి క్యూలైన్ల నిర్మాణం, ప్రత్యేక కేశఖండనశాల, హోమగుండాలు, అమ్మవారి ప్రసాదాల కౌంటర్ల ఏర్పాట్లు, భవానీ భక్తులు గిరిప్రదక్షిణ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపైన, కొండ దిగువన కనకదుర్గానగర్‌, కెనాల్‌రోడ్డు కృష్ణానది ఒడ్డున ఘాట్లను మంత్రి, అధికారులు పరిశీలించారు. నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, జాయింట్‌ కలెక్టర్లు మాధవీలత, మోహన్‌కుమార్‌ (ఆసరా), సబ్‌కలెక్టర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ఈఈ డి.వి.భాస్కర్‌, పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌, పలు శాఖల అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో పాల్గొన్నారు. అనంతరం ఇరిగేషన్‌ కాంపౌండ్‌లో ఉన్న రైతు శిక్షణ కేంద్రంలో ఉత్సవాల ఏర్పాట్ల గురించి చర్చించారు. దీక్ష విరమించేందుకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం లేకుండా కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు నిర్వహించాల్సిన బాధ్యతలపై కలెక్టర్‌ నివాస్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా భక్తులు అమ్మవారికి ఇరుముడులు సమర్పించి నేతి కొబ్బరి కాయలను వేసే హోమగుండాలను మహామండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కనీసం నాలుగు ఏర్పాటు చేయాలని దుర్గగుడి అధికారులకు సూచించారు. హోమగుండాల వద్ద అగ్నిమాపకశాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్యూలైన్లను గతం కంటే మెరుగ్గా ఏర్పాటు చేయాలని, భక్తులకు మంచినీటిని అందించాలని, ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున సీసీ కెమెరాలు, పబ్లిక్‌ మైక్‌ అనౌన్స్‌మెంట్‌ పక్కాగా ఉండాలని సూచించారు. సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్‌ భాగ్యలక్ష్మి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T06:41:15+05:30 IST