రెండో వైస్ ఎంపీపీ ఎవరో!
ABN , First Publish Date - 2021-12-30T06:28:34+05:30 IST
రెండో వైస్ ఎంపీపీ ఎవరో!

గన్నవరం, మైలవరంలో తీవ్ర ఉత్కంఠ
విజయవాడ రూరల్, డిసెంబరు 29 : మండల ప్రజా పరిషత్‌ల్లోనూ రెండో వైస్ ఎంపీపీని నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని విజయవాడ రూరల్ మండలంలో ఆ పదవికి డిమాండు పెరిగింది. జిల్లా ప్రజా పరిషత్‌లలో ఇప్పటికే రెండు వైస్ చైర్మన్ పదవులను ఇచ్చేయగా, జనవరి నాలుగున మండలాల్లో రెండో వైస్ ఎంపీపీ పదవికి ఎన్నిక జరగనుంది. ఇందుకు నేడో, రేపో నోటీఫికేషన్‌ను కూడా విడుదల కానుంది. దీంతో ఆ పదవిపై అనేక మంది ఆశలు పెంచుకున్నారు. విజయవాడ రూరల్ మండలంలో 40 ఎంపీటీసీ సెగ్మెంట్‌లుండగా, గన్నవరం నియోజకవర్గం పరిధిలో 26, మైలవరం పరిధిలో 14 ఉన్నాయి. ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వుకావడంతో ప్రసాదంపాడు నుంచి గెలుపొందిన చెన్ను ప్రసన్నకుమారి ఎంపీపీగా, గొల్లపూడి నుంచి గెలుపొందిన వేమూరి సురేష్ ఒకటో ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో వైస్ ఎంపీపీ కోసం రెండు నియోజకవర్గాల నుంచి ఆశావహులు పెరుగుతున్నారు. ఇప్పటికే ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంపీటీసీ సభ్యులు నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంపీపీ గన్నవరం, వైస్ ఎంపీపీ మైలవరానికి కేటాయించగా, కో ఆప్షన్ సభ్యుడు కూడా మైలవరం పరిధిలోని గొల్లపూడి నుంచే ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రెండో వైస్ ఎంపీపీ పదవిని నున్న - అంబాపురం రూట్‌లోని ఎంపీటీసీలకు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. ఎంపీపీ బీసీ, వైస్ ఎంపీపీ ఓసీ వర్గానికి చెందినవారున్నందున, రెండో వైస్ ఎంపీపీ పదవిని ఎస్సీలకు కేటాయించాలనే వినతి కూడా తెరపైకి వచ్చింది.
రెండో వైస్ ఎంపీపీ పదవికి ఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మండలంలో ఆ పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుండగా, ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. వారు ఎవరి పేరును ప్రతిపాదించినా అందుకు ఎంపీటీసీ సభ్యులంతా కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు.