కరోనాతో స్టాఫ్‌నర్సు మృతి

ABN , First Publish Date - 2021-05-20T06:31:11+05:30 IST

విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సీనియర్‌ స్టాఫ్‌ నర్సు వై.రత్నకుమారి (53) కరోనాతో బుధవారం మృతి చెందారు.

కరోనాతో స్టాఫ్‌నర్సు మృతి

  మరో 30 మందికిపైగా నర్సులకు పాజిటివ్‌ 

విజయవాడ, మే 19 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సీనియర్‌ స్టాఫ్‌ నర్సు వై.రత్నకుమారి (53) కరోనాతో  బుధవారం మృతి చెందారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా కరోనా బాధితులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌ బాధితులకు వైద్యసేవలందిస్తున్న క్రమంలోనే రత్నకుమారి కొవిడ్‌ వైరస్‌ బారినపడ్డారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఈనెల 12వ తేదీన జీజీహెచ్‌లోనే అడ్మిట్‌ అయ్యారు. అంతకంతకూ ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోవడంతో ఆసుపత్రి వైద్యులు ఆమెను ఐసీయూలోకి మార్చి చికిత్స అందిస్తుండగా బుధవారం ఉదయం 5 గంటల సమయంలో కన్ను మూశారు. 1999లో నర్సింగ్‌ వృత్తిలోకి ప్రవేశించిన ఆమె 22 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తూ మంచి పేరు సంపాదించుకున్న రత్నకుమారి మరణం పట్ల ఆసుపత్రి అధికారులు, నర్సులు, వైద్యసిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదే ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో నియామకమైన మరో స్టాఫ్‌నర్సు రేవతి కూడా గతనెలలో కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు నర్సులు కరోనాకు బలైపోయారు. ఈ సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు 30 మందికిపైగా నర్సులు వైరస్‌ బారినపడ్డారు. వీరిలో కొంతమంది వ్యాధి నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరగా.. ఇంకొందరు హోం ఐసోలేషన్‌లోను, ఆసుపత్రిలోను చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రిలో 1000 మందికిపైగా కరోనా బాధితులకు వైద్యసేవలందిస్తున్నారు. ఈ క్రమంలో కొవిడ్‌ నోడల్‌ ఆఫీసరు డాక్టర్‌ గోపీచంద్‌ సహా పలువురు డాక్టర్లు,  జూనియర్‌ డాక్టర్లు, హౌస్‌సర్జన్లు, పీజీలు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, పారామెడికల్‌ సిబ్బంది, నాలుగో తరగతి సిబ్బందిలో 20శాతానికిపైగా ఉద్యోగులు కరోనా బారినపడినట్లు ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.  

Updated Date - 2021-05-20T06:31:11+05:30 IST