ధరల భారాలపై కన్నెర్ర

ABN , First Publish Date - 2021-10-29T06:50:35+05:30 IST

అధిక ధరలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎర్రదండు రోడ్డెక్కింది.

ధరల భారాలపై కన్నెర్ర
కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద వామపక్షాల నిరసన ప్రదర్శన

రోడ్డెక్కిన ఎర్రదండు

ధరలను నియంత్రించాలంటూ వామపక్షాల రాస్తారోకో

స్తంభించిన కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌

నిరసనపై పోలీసుల ఉక్కుపాదం 

నాయకులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు


వన్‌టౌన్‌, అక్టోబరు 28: అధిక ధరలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎర్రదండు రోడ్డెక్కింది. రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలను నియంత్రించా లంటూ నిరసన గళం వినిపించింది. ధరల పెరుగుదలకు నిరసనగా గురువారం వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకోతో విజయవాడ నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనలో పాల్గొనేందుకు గురువారం ఉదయం నుంచే వన్‌టౌన్‌లోని కాళేశ్వరరావు మార్కెట్‌ వద్దకు పెద్ద ఎత్తున మహిళలు, ప్రజాసంఘాల నాయకులు, ఆటో డ్రైవర్లు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన ఆటోలతో కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. మరోవైపు ప్రజాసంఘాల కార్యకర్తలు, మహిళలు నలువైపులా రోడ్లను దిగ్బంధించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, కె.రామకృష్ణలను, ఇరుపార్టీల రాష్ట్ర నాయకులు సీహెచ్‌ బాబూరావు, దోనేపూడి శంకర్‌, మేధావుల సంఘం నాయకుడు చలసాని శ్రీనివాస్‌ తదితరులను ఈడ్చి పోలీసు వాహనాల్లో పడేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీఎం నాయకులు మధు, బాబూరావు రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు నాయకుల చొక్కాలు చిరిగిపోయాయి. సుమారు 50 మంది వామపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. 


స్టేషన్లోనూ నిరసన

అరెస్టు చేసిన నాయకులందరినీ పోలీసులు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌ సెల్లార్లో కూర్చోబెట్టారు. అక్కడ కూడా వారంతా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పోలీసులు వారందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 

Updated Date - 2021-10-29T06:50:35+05:30 IST