రైతుల్లో భయంభయం

ABN , First Publish Date - 2021-05-14T04:31:31+05:30 IST

రైతుల్లో భయంభయం

రైతుల్లో భయంభయం
బస్తాలకెక్కించిన ధాన్యం

వాతావరణంలో మార్పులతో బెంబేలు

కోస్తాతీరం వెంబడి మూడురోజులు వర్షాలు

ఇంకా కల్లాల్లోనే ధాన్యం

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు అన్నదాతలను పరుగులు పెట్టిస్తున్నాయి.  శుక్రవారం నుంచి మూడు రోజులపాటు కోస్తాతీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లావ్యాప్తంగా గురువారం ఆకాశం మేఘావృతమై ఉంది. ఏ క్షణంలోనైనా వర్షం కురిస్తే చేతికందే దశలో ఉన్న పంటలు నీట మునుగుతాయనే భయం రైతులను వెంటాడుతోంది. దీంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు. యంత్రాల ద్వారా నూర్పిడి పూర్తిచేసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, విక్రయించి లారీలకు ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నారు. 

వెంటాడుతున్న అకాల వర్షం

మే నెలలో జిల్లాను వర్షం వెంటాడుతూనే ఉంది. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో కురిసిన వర్షంతో కల్లాల్లోని ఽధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు తదితర నియోజకవర్గాల్లో కురిసిన వర్షానికి ధాన్యంతో పాటు మామిడి, వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. కరోనా విజృంభణ కారణంగా కూలీలు దొరక్కపోవడంతో ధాన్యం రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాలో ఈ రబీ సీజన్‌లో 82,363 హెక్టార్లలో వరిసాగు జరిగింది. 6 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అయితే, ఇప్పటివరకు లక్ష టన్నుల ధాన్యం కూడా కొనుగోలు జరగని పరిస్థితి. రెండు రోజుల క్రితం వరకు 75 కిలోల బస్తా ధాన్యం వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసిన మిల్లర్లు, వ్యాపారులు గురువారం నుంచి ధాన్యం ధరను మరో రూ.20 తగ్గించేశారు. వాస్తవానికి బస్తా ధాన్యం రూ.1,418కు కొనాలి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, వ్యాపారుల లాభాపేక్ష తదితర అంశాల నేపథ్యంలో బస్తాకు రూ.438 రైతులు నష్టపోవాల్సి వస్తోంది. బందరు మండలంలోని శివారు ప్రాంతాల్లో ఇంకా పది రోజులకు గానీ వరికోతలు కోసే పరిస్థితి లేదు. ఈ తరుణంలో భారీ వర్షం కురిస్తే పంటలు నేలవాలి దెబ్బ తింటాయనే భయం రైతులను వెంటాడుతోంది. భారీవ ర్షంతో పాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన గాలులు వీస్తే కోతకు సిద్ధంగా ఉన్న మామిడి రాలిపోతుందని, దీంతో మామిడి ధరలు మరింత  తగ్గుతాయని పశ్చిమ కృష్ణా రైతులు, కూరగాయల పంటలు దెబ్బతింటాయని డెల్టా ప్రాంత రైతులు భయపడుతున్నారు. 








Updated Date - 2021-05-14T04:31:31+05:30 IST