విచారణకు ఇన్నాళ్లా?

ABN , First Publish Date - 2021-12-28T05:50:16+05:30 IST

రైళ్లలో అక్రమ రవాణా కేసు రోజుల తరబడి సాగుతోంది.

విచారణకు ఇన్నాళ్లా?

నెలకు పైగా సాగుతున్న రైల్వే అక్రమ రవాణా కేసు 

కమర్షియల్‌ బాస్‌ను కాపాడేందుకేనా?

కేసు చుట్టూ అనుమానాలు.. ఆరోపణలు.. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రైళ్లలో అక్రమ రవాణా కేసు రోజుల తరబడి సాగుతోంది. రైళ్లలో గ్యాస్‌ సిలిండర్లు, నిత్యావసరాల అక్రమ రవాణా చేపట్టిన సిండికేట్‌పైన, సహకరించిన ‘కమర్షియల్‌’ బాస్‌పైన విచారణకు ఆదేశించి నెల దాటినా, విచారణ పూర్తి కాలేదు. జరుగుతున్న జాప్యం వెనుక అధికారిని కాపాడే ప్రయత్నం ఉందా? అనే సందేహం తలెత్తుతోంది. వాస్తవమేమిటో విచారణ జరుపుతున్న కమర్షియల్‌ విభాగం అధికారులే చెప్పాలి. ఈ వ్యవహారంపై తక్షణం విచారణ జరిపి బాధ్యులైన వారిపై రిపోర్టు పంపాలని జీఎం గజానన్‌ సైతం ఆదేశించారు. అయినా కేసు ఒక కొలిక్కిరాలేదు. అధికారితో పాటు బాధ్యులైన వ్యక్తులు, వారికి సహకరిస్తున్న అధికారిక కాంట్రాక్టర్లు కూడా ఈ కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోపక్క గ్యాస్‌ సిలిండర్లను, నిత్యావసరాలను అక్రమంగా రవాణా చేస్తున్న నిర్వాహకుడిని సీసీ కెమెరాలు పట్టిచ్చినా, తప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఆర్‌పీఎఫ్‌ పోలీసులు పెట్టిన బలహీనమైన కేసే ఇందుకు నిదర్శనం. ఈ కేసులో ప్రధాన సూత్రధారిని కాకుండా ఏదో ఒక రైలులో మాత్రమే రవాణా చేసే నిర్వాహకుడిని తెరపైకి తీసుకు రావటం ద్వారా కేసు తీవ్రత తగ్గించే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. తమను విచారిస్తే మరిన్ని విషయాలు చెబుతామని స్క్వాడ్‌ టీమ్స్‌ చెబుతున్నా పట్టించుకోకపోవడానికి కారణం అధికారులే చెప్పాలి. ఇప్పటి వరకు ఒక్క క్యాటరింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను మాత్రమే విచారించగా, ఆయన జరిగింది వాస్తవమేనని చెప్పినట్టు తెలుస్తోంది. ఇన్ని ఆధారాలు ఉన్నా.. కేసు రోజుల తరబడి సాగుతుండటం చూస్తే, ఇదంతా కమర్షియల్‌ బాస్‌ను, ఆయన బినామీని రక్షించే ప్రయత్నాల్లో భాగమేననే ఆరోపణ నిజమనిపిస్తోంది.

Updated Date - 2021-12-28T05:50:16+05:30 IST