రైళ్లలో అక్రమ రవాణాపై జీఎం సీరియస్
ABN , First Publish Date - 2021-11-26T06:28:35+05:30 IST
రైళ్లలో గ్యాస్ బండలు, ఇతర నిత్యావసరాల అక్రమ రవాణాపై దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ సీరియస్ అయ్యారు.

‘ఆంధ్రజ్యోతి’ కథనాలకు స్పందన
శాఖాపరమైన విచారణకు ఆదేశం
కేసు తీవ్రతను తగ్గించేందుకు కమర్షియల్ అధికారి ప్లాన్
తనతోపాటు బినామీనీ రక్షించుకునేందుకు యత్నం
రైల్వే కోర్టులో తప్పు అంగీకరించిన బినామీలు
ఆర్పీఎఫ్ తీరుపై రైల్వే కోర్టు మేజిస్ర్టేటు ఆగ్రహం
ఒకరికి జైలు శిక్ష.. మరొకరికి స్వల్ప జరిమానా
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రైళ్లలో గ్యాస్ బండలు, ఇతర నిత్యావసరాల అక్రమ రవాణాపై దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ సీరియస్ అయ్యారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వరుస కథనాలపై స్పందించిన ఆయన వెంటనే దీనిపై అంతర్గత దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకుని తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో విజయవాడ డివిజన్ కమర్షియల్ విభాగం ఉన్నతాధికారులు అంతర్గత విచారణను ముమ్మరం చేశారు. ఇంత జరుగుతున్నా కమర్షియల్ అధికారి మాత్రం తన బినామీని రక్షించే పనిలోనే నిమగ్నం కావటం గమనార్హం! సీనియర్ డీసీఎం భాస్కరరెడ్డి విచారణను ముమ్మరం చేయటంతో.. కమర్షియల్ అధికారి తనతో పాటు తన బినామీని కాపాడుకోవడానికి వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. రెండు రకాల ప్లాన్ల్తో సిద్ధమైన ఆయన మొదటి ప్లాన్లో భాగంగా ప్యాంట్రీ నిర్వాహకుల నుంచి తాత్కాలిక అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు చేద్దామనుకున్నారు. జీఎం ఆదేశాలతో డిపార్ట్మెంటల్ విచారణ వేగంగా జరుగుతుండడంతో అది సాధ్యం కాలేదు. దీంతో రెండో ప్లాన్ను అమలు చేశారు. అందులో భాగంగా రైల్వేలోని నిఘా వ్యవస్థలను ఆయన దాదాపు మేనేజ్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
తెరవెనుక చక్రం తిప్పిన అధికారి
అక్రమ రవాణా వ్యవహారంలో బినామీ ఒకరే అని భావించగా, ఇద్దరు తెరపైకి వచ్చారు. వీరిలో పెద్ద బినామీని కాపాడుకునేందుకు వీలుగా అతనిపై తక్కువ నేరాన్ని మోపుతూ, ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసేలా కమర్షియల్ అధికారి తెర వెనుక చక్రం తిప్పారని తెలుస్తోంది. అక్రమ రవాణాకు ఒకేఒక్క రైలుపై ఆధారపడిన చిన్న బినామీపై కేసు తీవ్రత పెరిగేలా నేరాన్ని మోపి, అత్యధిక రైళ్లలో అక్రమ రవాణా జరిపే పెద్ద బినామీపై కేసు తీవ్రత తక్కువుగా ఉండేలా కమర్షియల్ అధికారి మేనేజ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. కేసుల తీవ్రతను బట్టే విచారణ ఉంటుంది.
ఆర్పీఎఫ్ పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
ఈ వ్యవహారంలో ఇద్దరు బినామీలూ తప్పు చేసినట్టు రైల్వే కోర్టులో అంగీకరించారు. దీంతో ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే సరైన తనిఖీలు ఎందుకు చేయడం లేదని మేజిస్ర్టేట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కేసుల తీవ్రతను తారుమారు చేసి ఇద్దరు బినామీలపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేయడంతో, అందుకనుగుణంగానే శిక్షలు పడ్డాయి. అక్రమ రవాణాకు ఒక్క రైలును ఎంచుకున్న చిన్న బినామీపై ఆర్పీఎఫ్ పెద్ద నేరాన్ని మోపింది. దానితో అతనికి జైలు శిక్ష పడగా, అత్యధిక రైళ్లలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న పెద్ద బినామీకి మాత్రం జరిమానాతో సరిపెట్టినట్టు తెలుస్తోంది.