రాహుల్ హత్య కేసులో.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి..!
ABN , First Publish Date - 2021-09-03T16:15:16+05:30 IST
యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో..

పోలీసులకు చిక్కకూడదనే...
రాహుల్ హత్య కేసులో స్కెచ్
నాలుగు భాగాలుగా ప్రణాళిక
విజయవాడ(ఆంధ్రజ్యోతి): యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో విజయవాడ జిల్లా జైలులో ఉన్న కోగంటి సత్యనారాయణ అలియాస్ సత్యంను మాచవరం పోలీసులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. ఒక రహస్య ప్రదేశంలో సత్యంను విచారిస్తున్నారు. రాహుల్ హత్యకు సూత్రధారి, పాత్రధారులుగా కోగంటి సత్యం, కోరాడ విజయ్‌కుమార్ వ్యవహరించారు. అసలు రాహుల్‌ను హత్య చేయాలన్న ఆలోచనకు కారణం మాత్రం విజయ్‌కుమార్ వ్యాపార భాగస్వామి, సన్నిహితురాలు చాగర్ల గాయత్రి అని తెలుస్తోంది. ఈమె కుమార్తె మైత్రీకి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పీజీ సీటు కోసం రాహుల్ రూ.6 కోట్లు తీసుకున్నాడు. దీనికి మధ్యవర్తిగా విజయ్‌కుమార్ ఉన్నాడు. రాహుల్ సీటు ఇప్పించకపోవడం, తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతో విజయ్ కుమార్‌పై గాయత్రి తీవ్రమైన ఒత్తిడి చేసినట్టు సమాచారం.
గాయత్రి దెబ్బకు విజయ్‌కుమార్ వెంటనే కోగంటి సత్యంను ఆశ్రయించారు. రాహుల్ డబ్బులు ఇవ్వలేని పక్షంలో అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. స్కెచ్ మొత్తం కొండపల్లిలోని కోగంటి సత్యం ఫ్యాక్టరీ, ఏలూరు రోడ్డు సీతారామపురం జంక్షన్‌లోని కోరాడ చిట్‌ఫండ్స్ కార్యాలయంలో జరిగినట్టు తేలింది. కోరాడ చిట్‌ఫండ్ కార్యాలయంలో రాహుల్‌పై దాడి చేయడానికి నలుగురిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి కారులో గాంధీనగర్‌లో సత్యంకు చెందిన దుర్గా కళామందిర్‌లో సంతకాలు చేయించుకోవడానికి మరికొంత మందిని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత రాహుల్‌ను ఠాగూర్ రైసుమిల్లు వీధిలోకి తీసుకొచ్చి హత్య చేయడానికి మరో ఇద్దర్ని నియమించుకున్నారు.
తర్వాత అక్కడి నుంచి కోగంటికి చెందిన సత్యం దొడ్డికి వెళ్లి, మరొకరితో డబ్బులు రప్పించుకున్నారు. ఈ నాలుగు ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులను ఉపయోగించుకున్నారు. రాహుల్ కంపెనీలో వాటాలను గాయత్రి, కోరాడ పేరు మీద రాయించుకున్నారని తెలిసింది. తర్వాత ఈ వాటాలను నెమ్మదిగా కోగంటి పేరు మీదకు బదిలీ చేయించుకోవడానికి వ్యూహం రచించారు. కోరాడ విజయ్‌కుమార్ నోరు విప్పడం, అందులో నుంచి కోగంటి పేరు బయటకు రావడంతో ఉన్నట్టుండి పరారయ్యాడు. పక్కా వ్యూహంతో పోలీసులు బెంగళూరులో కోగంటిని అరెస్టు చేశారు.