రాహుల్‌ హత్య వెనుక పక్కా ప్లాన్‌..!

ABN , First Publish Date - 2021-08-20T06:14:01+05:30 IST

రాహుల్‌ హత్య వెనుక పక్కా ప్లాన్‌..!

రాహుల్‌ హత్య వెనుక పక్కా ప్లాన్‌..!
హత్య జరిగింది ఈ కారులోనే..

ప్రధాన నిందితుడిగా కోరాడ విజయ్‌కుమార్‌

మరో ముగ్గురు, నలుగురు ఉండొచ్చని నిర్ధారణ

అజ్ఞాతంలోకి కోరాడ

దర్యాప్తు వేగవంతం

విజయవాడ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ (29) హత్యకు నిందితులు పక్కా స్కెచ్‌ వేశారు. విశాలమైన వీధులు. ఎవరి పనుల్లో వారుంటారు. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు. కారు గంటలకొద్దీ ఒకేచోట ఉన్నా ఎవరికీ అనుమానం రాదు. అందుకే నిందితులు బందరు రోడ్డులోని డీవీ మనార్‌ రోడ్డులో ఉన్న ఠాగూర్‌ రైస్‌మిల్లు వద్దకు రాహుల్‌ను రమ్మన్నారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు తాడిగడపలోని ఇంటి నుంచి రాహుల్‌ బయటకొచ్చాడు. రాత్రి తొమ్మిది గంటలకే ఏపీ16ఎఫ్‌ఎఫ్‌9999 కారు అక్కడ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంటే దీనికి ముందే కారులో నిందితులు, రాహుల్‌ మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలుసుకున్నారు. ఈ ఘటనలో పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఫైనాన్స్‌ వ్యాపారిగా ఉన్న కోరాడ విజయ్‌కుమార్‌ ప్రధాన నిందితుడిగా నిర్ధారించారు. 

ఎవరీ కోరాడ..?

రాహుల్‌ కెనడాలో ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. తాడేపల్లిగూడేనికి చెందిన గట్టు మాణిక్యాలరావు కుమార్తెను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. రాహుల్‌ ఏర్పాటుచేసిన జడ్‌ఎక్స్‌ ఇన్‌ సిలిండర్స్‌ ప్రైవేట్‌ లిమెటెడ్‌ కంపెనీలో కోరాడ విజయ్‌కుమార్‌ భాగస్వామి. ఆ కంపెనీకి డైరెక్టర్‌. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆరాటంతో 2019 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. రాహుల్‌కు, విజయ్‌కుమార్‌కు మధ్య లాక్‌డౌన్‌ నుంచి వివాదాలు నడుస్తున్నాయి. ఇదంతా రూ.కోట్లలో ఉన్నట్టు సమాచారం. ఇద్దరికీ వయస్సురీత్యా చాలా వ్యత్యాసం ఉంది. ఈ డబ్బు గొడవల నేపథ్యంలో కోరాడ ఈ హత్యకు కిరాయి హంతకులను నియమించాడా లేక రాహుల్‌ వద్ద ఉండే వారినే హంతకులుగా మార్చాడా అన్నది తెలియాల్సి ఉంది. హత్య జరిగిన సమయంలో కోరాడ అక్కడికి సమీపంలో ఉన్నట్టు సమాచారం. ఆయనతో సన్నిహిత సంబంధం సాగిస్తున్న ఓ మహిళ రైసుమిల్లు వీధికి సమీపాన ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. ఆమె ఇంటి నుంచే కోరాడ స్కెచ్‌ను అమలు చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్‌ను చంపేశాక నిందితులు కారు తాళం తీసుకుని బయటకు వచ్చి ఇన్నర్‌ లాక్‌ చేశారు. ఆ తర్వాత కోరాడ విజయ్‌కుమార్‌ సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి బెంగళూరు పారిపోయినట్టు తెలుస్తోంది.  కారు ఉన్న పక్క భవనంలో ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ నిర్వహిస్తున్న వ్యక్తి కారులోకి చూశాడు. రాహుల్‌ నిద్రపోయి ఉంటే పొట్ట వద్ద స్వల్ప కదలికలు ఉంటాయి. ఎలాంటి కదలికలు లేకపోవడంతో రాహుల్‌ చనిపోయి ఉంటాడన్న అనుమానంతో 100కు ఫోన్‌ చేశాడు. మాచవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. దీనికి ముందే రాహుల్‌ తండ్రి రాఘవరావు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, రాహుల్‌ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహిస్తారు. 

సెల్‌ స్విచ్ఛాఫ్‌ చేసిందెవరు?

15 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పి వెళ్లిన రాహుల్‌ తిరిగి రాకపోయే సరికి అతడి భార్య ఫోన్లు చేస్తూనే ఉంది. రాత్రి 11 గంటల వరకు మోగిన రాహుల్‌ ఫోన్‌ ఆ తర్వాత స్విచ్ఛాఫ్‌ అయ్యింది. నిందితులు 11 గంటలకు రాహుల్‌ను చంపేసి సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి ఉంటారని తెలుస్తోంది. రాహుల్‌కు పరిచయం ఉన్న వ్యక్తులతోనే ఫోన్‌ చేయించి అతడ్ని ఇంటి నుంచి బయటకు రప్పించినట్టు తెలుస్తోంది. చెరువు మాధవరంలో జడ్‌ఎక్స్‌ ఇన్‌ పేరుతో పరిశ్రమను ఏర్పాటు చేసిన రాహుల్‌ తాజాగా పుంగనూరులో మరో ప్లాంట్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్టు సమాచారం. 

అసలు ‘సత్య’మేంటి?

రాహుల్‌ హత్య వెనుక కోరాడ విజయ్‌కుమార్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నా, మరో బడా పారిశ్రామికవేత్త హస్తం కూడా ఉన్నట్టు ఆధారాలు లభించాయి. ప్రతి మాట ‘సత్య’మే చెబుతానని చెప్పే ఆ పారిశ్రామికవేత్త మొత్తం మ్యాప్‌ వేసినట్టు తెలుస్తోంది. రాహుల్‌కు చెందిన జడ్‌ఎక్స్‌ ఇన్‌ కంపెనీలో కోరాడ చాలా తక్కువ పెట్టుబడి పెట్టాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ పారిశ్రామికవేత్త వద్ద భారీగా అప్పు చేశాడు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లినా విజయం వరించకపోవడంతో విజయ్‌కుమార్‌ అప్పులపాలయ్యాడు. బడా పారిశ్రామికవేత్తకు ఉన్న అప్పులను తీర్చలేక ఓ రాజీ ఫార్ములాను రూపొందించాడు. జడ్‌ఎక్స్‌ ఇన్‌ కంపెనీలో ఉన్న తన వాటాను ఈ బడా పారిశ్రామిక వేత్తకు ఇచ్చేశాడు. మొత్తం కంపెనీకే ఎసరు పెట్టడానికి ఆ పారిశ్రామికవేత్త సిద్ధమయ్యాడు. చిన్నచిన్న వివాదాలను తెరపైకి తెచ్చాడు. రాహుల్‌ అడ్డు తొలగించుకుంటే మిగిలిన భాగస్వాములు జారిపోతారని భావించాడు. జడ్‌ఎక్స్‌ ఇన్‌ మొత్తం తన వశం చేసుకోవాలనే ఈ హత్యకు ప్రేరేపించినట్టు తెలుస్తోంది. Updated Date - 2021-08-20T06:14:01+05:30 IST