పార్టీ మారిపో..!

ABN , First Publish Date - 2021-02-01T07:03:33+05:30 IST

పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు వేసిన..

పార్టీ మారిపో..!

ప్రత్యర్థులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు

గ్రామంలో బలమైన నాయకులపైనే వైసీపీ నేతల దృష్టి

పార్టీ మారకుంటే కష్టాలు తప్పవంటూ బెదిరింపులు

మైలవరంలో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే బామ్మర్ది

మూలపాడులో టీడీపీ నేతల ఇళ్లకెళ్లి బెదిరింపులు

టీడీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో పలాయనం

వైసీపీ నేతలకు అధికారుల వత్తాసు

టీడీపీ బలపర్చిన అభ్యర్థులకు ని‘బంధనాలు’

అద్దెకుంటే ఇంటి యజమాని పన్ను బకాయిలు కట్టాలని షరతు


‘మీరు గ్రామంలో బలమైన నాయకులు. మా పార్టీలో చేరిపోండి. మీ పార్టీ తరఫున సర్పంచిగా, వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసిన వారినీ మా పార్టీలో చేర్పించండి. మీకు తగిన న్యాయం చేస్తాం. మా మాట వినకుంటే మాత్రం మున్ముందు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది.’ - మూలపాడులో టీడీపీ నాయకుడికి మైలవరం ఎమ్మెల్యే బామ్మర్ది చేసిన సూచన లాంటి బెదిరింపు ఇది. 


పంచాయతీ పోరు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తోంది. పార్టీ రహితం అనే పేరు తప్ప అభ్యర్థుల నడుమ పోటీ నువ్వా నేనా అన్న రీతిలో ఉంది. పలు ప్రాంతాల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులను డబ్బుతో లొంగదీసుకునేందుకు అధికార పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. దారికి రాని వాళ్లను బెదిరించో భయపెట్టో తమ దారికి తెచ్చుకొనేందుకు రంగంలోకి దిగారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో గెలుపు గుర్రాలను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగానో.. ఆర్థిక స్థోమతుల వల్లో అభ్యర్థులకు చాలా పంచాయతీల్లో గాడ్‌ఫాదర్‌ లాంటి నాయకుల దన్ను ఉంటుంది. ఇలాంటి నాయకులను వైసీపీ నాయకులు టార్గెట్‌ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గమైన మైలవరంపై వైసీపీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక పంచాయతీలను ఏకగ్రీవం చేయించే దిశగా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులను తమ పార్టీలోకి ఆహ్వానించడం లేదా బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం మూలపాడులో టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధి బామ్మర్ది వారితో బేరసారాలు, బెదిరింపులు మొదలుపెట్టారు. మూలపాడులో సీనియర్‌ టీడీపీ నాయకుడు గరికపాటి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన స్థానిక ప్రజాప్రతినిధి బామ్మర్ది ఆయన్ను వైసీపీలో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారు. పార్టీ మారనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విషయం తెలసుకున్న స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని, వైసీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వైసీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


మైలవరం అంతటా ఇదే తంతు

ఇదే తంతు మైలవరం నియోజకవర్గం అంతటా జరుగుతోంది. బలమైన టీడీపీ నాయకులు, గెలుపు గుర్రాలైన అభ్యర్థులే లక్ష్యంగా వైసీపీ నాయకులు వేట మొదలుపెట్టారు. క్షేత్రస్థాయిలో వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించిన వైసీపీ నేతలు వీలైనన్ని ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవాలు చేయాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. 


నేతలకు అధికారుల వత్తాసు

అధికార పార్టీ నాయకులకు అధికారులు దాసోహం అంటున్నారు. ప్రత్యర్థులను అసలు పోటీలోనే లేకుండా చేసేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా మైలవరంలో పంచాయతీ కార్యదర్శి తనకు సంబంధం లేకపోయినా, కొత్త నిబంధనలు తీసుకొచ్చి టీడీపీ బలపర్చిన అభ్యర్థుల నామినేషన్లు తీసుకునేందుకు నిరాకరించారు. అద్దెకు ఉండే ఇంటి యజమాని ఆస్తిపన్ను బకాయిలు కూడా అభ్యర్థి చెల్లిస్తేనే నామినేషన్‌కు అనుమతిస్తామంటూ నామినేషన్లు స్వీకరించేందుకు నిరాకరించారు. అభ్యర్థితోపాటు అభ్యర్థిని బలపర్చిన వారి ఇంటి పన్ను, ఒకవేళ వారు అద్దెకుంటే ఆ ఇంటి యజమాని ఇంటి పన్ను బకాయిలు కూడా తీర్చేయాలని కొత్త నిబంధనలు తెరపైకి తీసుకొచ్చారు. అలాంటి నిబంధనలు ఏవీ లేవని, ఉంటే ఆ నిబంధనల కాపీ తమకు చూపాలని టీడీపీ నాయకులు, అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. అయినా నామినేషన్ల స్వీకరణతో నీకేం సంబంధమని నిలదీయడంతో పంచాయతీ కార్యదర్శి వెనక్కు తగ్గారు. తన ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా అలా చేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. టీడీపీ నాయకులు ఈ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. అలాంటి నిబంధనలు ఏమీ లేవని స్పష్టం చేయడంతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం సజావుగా ముగిసింది. 


నామినేషన్‌ ఉపసంహరించుకుంటే అరకోటి విలువైన ఇళ్ల స్థలం!

మైలవరం నియోజకవర్గంలో అత్యధిక పంచాయతీలను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు అన్ని అడ్డదారులూ తొక్కుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి బామ్మర్ది రంగంలోకి దిగి, సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసిన వారితో విత్‌డ్రా చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్‌ ఉపసంహరించుకుంటే రూ.అరకోటి విలువైన ఇళ్ల స్థలం ఇస్తామంటూ బేరాలు పెడుతున్నారు. స్థానికంలో పట్టు కోల్పోతే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కదేమో అన్న ఉద్దేశంతో స్థానిక ప్రజాప్రతినిధి తన శక్తులన్నీ ఒడ్డి వైసీపీ బలపర్చిన అభ్యర్థులను గెలుపు దిశగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగో తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో అప్పటి వరకు బేరాలు.. బెదిరింపులు కొనసాగే అవకాశాలున్నాయి.

Updated Date - 2021-02-01T07:03:33+05:30 IST