కుల ధ్రువీకరణ పత్రం నిరాకరణ
ABN , First Publish Date - 2021-02-06T06:44:19+05:30 IST
ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి టీడీపీ బలపర్చిన సర్పంచి అభ్యర్థిగా పోటీలో ఉన్న ముప్పనేని రవి ప్రసాద్ కుల ధ్రువీకరణ పత్రం కోసం పెట్టుకున్న దరఖాస్తును తహసీల్దార్ తిరస్కరించారు.

కోర్టును ఆశ్రయిస్తానంటున్న టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రవి ప్రసాద్
ఘంటసాల, ఫిబ్రవరి 5 : ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి టీడీపీ బలపర్చిన సర్పంచి అభ్యర్థిగా పోటీలో ఉన్న ముప్పనేని రవి ప్రసాద్ కుల ధ్రువీకరణ పత్రం కోసం పెట్టుకున్న దరఖాస్తును తహసీల్దార్ తిరస్కరించారు. రవిప్రసాద్ ఎస్సీ కాదు, ఓసీ అంటూ తహసీల్దార్ టి.చంద్రశేఖర నాయుడు ఎండార్స్‌మెంట్ జారీ చేశారు. శ్రీకాకుళం గ్రామపంచాయతీ పరిధిలోని సూరపనేనివారిపాలెం దళితవాడకు చెందిన రవి ప్రసాద్ తల్లిదండ్రులది కులాంతర వివాహం. తండ్రి ఓసీ, తల్లి ఎస్సీ మాదిగ. రవి ప్రసాద్‌కు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. 70 సంవత్సరాలుగా అదే దళితవాడలో నివాసముంటున్నారు. రవి ప్రసాద్ సోదరి ముప్పనేని శోభారాణి గతంలో ఎస్సీ రిజర్వ్ స్థానమైన నిడుమోలు నియోజకవర్గం నుంచి శాసనసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో శ్రీకాకుళం పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఎస్సీ రిజర్డ్ అభ్యర్థిగా ముప్పనేని రవిప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. రవి ప్రసాద్ 1998లో ఘంటసాల మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి పర్మినెంట్ కుల ధ్రువీకరణ పత్రం పొందారు. తనతోపాటు తన కుటుంబసభ్యులందరూ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందామని, నేడు తనను ఎస్సీ కాదు అనటం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. రవి ప్రసాద్ విద్యార్హత సర్టిఫికెట్లలో ఓసీ కమ్మ అని నమోదై ఉన్నందున తిరస్కరించామని తహసీల్దార్ కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తను కోర్టును ఆశ్రయించనున్నట్లు రవిప్రసాద్ తెలిపారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి పోటీలో ఉంటే వైసీపీ మద్దతుదారుడు ఓటమిపాలవుతాడనే భయంతోనే సర్టిఫికెట్‌ను అడ్డుకుంటున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరిబాబు విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామన్నారు.