ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-22T04:57:35+05:30 IST

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం
పవిత్రాలను తీసుకెళ్తున్న అర్చకులు

విజయవాడ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగుతాయి. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయ వేదపండితులు, అర్చకులు అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య పూజలు చేసి పవిత్రాలను ధారణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటలకు దర్శనానికి అనుమతించారు. శనివారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడటంతో భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. ఆలయ వేదపండితులు, అర్చకులు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మండపారాధన, అగ్నిప్రతిష్టాపన, సర్వప్రాయశ్చిత్త దేవతారాధన, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనం, వేదపారాయణం, హారతి, మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు. రెండోరోజు ఆదివారం కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. చివరి రోజు సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మూలమంత్ర హవనం, శాంతిక, పౌష్టిక హోమాలు, కూష్మాండబలి నిర్వహించిన అనంతరం 10 గంటలకు మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయని వేదపండితులు తెలిపారు. 

Updated Date - 2021-08-22T04:57:35+05:30 IST