దిగజారుతున్న పెసల ధర

ABN , First Publish Date - 2021-08-25T06:33:07+05:30 IST

కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో ఈ ఏడాది తొలకరిలో ఆరు వేల ఎకరాల్లో రైతులు పెసర సాగు చేశారు. ప్రస్తుతం కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

దిగజారుతున్న పెసల ధర
ఆరబోసిన పెసలు

 ప్రభుత్వ మద్దతు ధర 7,250 

 బహిరంగ మార్కెట్‌లో రూ.5,800 

 మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్‌

కంచికచర్ల : కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో ఈ ఏడాది తొలకరిలో ఆరు వేల ఎకరాల్లో రైతులు పెసర సాగు చేశారు. ప్రస్తుతం కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైతులు యంత్రాలతో పెసర పంటను కోయిస్తున్నారు. ఎకరానికి కనిష్టంగా రెండు నుంచి గరిష్టంగా మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. నాలుగు క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వచ్చినట్లయితే గిట్టుబాటు అయ్యేది. అయితే ఎక్కువ మంది రైతులకు రెండు క్వింటాళ్లలోపు దిగుబడి వచ్చింది. ఆశించిన దిగుబడి రాకపోగా, మార్కెట్‌ ధర రైతులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది.  క్వింటా 5,800 రూపాయలకు అడుగుతున్నారు. అదీ కూడా ఆచితూచి తప్ప చురుకుగా కొనటం లేదు. పెసల మద్దతు ధర క్వింటా 7,250 రూపాయలు. మార్కెట్‌ ధర 15 వందల రూపాయలు తక్కువగా ఉంది. పంట చేతికి వచ్చే సమయంలో వ్యాపారులు ధర తగ్గించి నిలువు దోపిడీ  చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఒకవైపు ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు రబీ పంటల సాగుకు పంట భూములను సిద్ధం చేయాల్సి ఉంది. అందుకు కావల్సిన సొమ్ముల కోసం పెసలు అమ్మేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. బయటి మార్కెట్లో తక్కువ ధరకు అమ్మితే క్వింటాకు 15 వందల రూపాయల వరకు  రైతులు నష్టపోవాల్సి వస్తుంది. తమ బాధలను దృష్టిలో పెట్టుకుని మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పెసర రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


Updated Date - 2021-08-25T06:33:07+05:30 IST