వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగాఉమ్మడి పోరాటం
ABN , First Publish Date - 2021-02-01T06:31:14+05:30 IST
ప్రధాని మోడీ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల కారణంగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో బలికాబోతున్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని రైతు సంఘాలు ఉమ్మడి పోరాటం చేయాలని దివి తాలూకా రైతు సదస్సు తీర్మానించింది.

సదస్సులో రైతు సంఘాల తీర్మానం
అవనిగడ్డ టౌన్, జనవరి 31 : ప్రధాని మోడీ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల కారణంగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో బలికాబోతున్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని రైతు సంఘాలు ఉమ్మడి పోరాటం చేయాలని దివి తాలూకా రైతు సదస్సు తీర్మానించింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పరుచూరి రాఘవేంద్రరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన దివి తాలూకా రైతు సదస్సుల్లో వివిధ పార్టీల రైతు సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల కారణంగా రైతులకు జరిగే నష్టాలను వివరించారు. రైతు నేతలు మాట్లాడుతూ దేశ ప్రజల ఆహార భద్రతకు, జీవన మనుగడకు ఈ చట్టాలు పెను ప్రమాదాన్ని తీసుకొస్తాయని, రైతుల సంక్షేమం కోసమంటూ కేంద్ర ప్రభుత్వం రైతులను కార్పొరేట్ శక్తుల చేతిలో బలి చేయటానికి సిద్ధపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్ర ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతోందని, కేవలం ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర మీటర్లు బిగిస్తే సరిపోయేదానికి రైతుల పొలాల్లో మీటర్లు బిగించటం ఎందుకని రైతు సంఘం నేతలు ప్రశ్నించారు. సదస్సులో ఆలిండియా కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి.హరనాథ్, సీపీఐ ఎంఎల్ నేతలు జన్ను జగన్, తలశిల లీలామనోహరరావు, న్యూడెమోక్రసీ నేత మారుబోయిన పులింద్రరావు, రైతు కార్యచరణ కమిటీ ప్రధాన కార్యదర్శి రేపల్లె యోగప్రకాష్, రైతు కార్యచరణ కమిటీ అధ్యక్షుడు వంగల సుబ్బారావు పాల్గొన్నారు.