బీసీలకు న్యాయం ఇదేనా!

ABN , First Publish Date - 2021-08-25T06:44:05+05:30 IST

బీసీలకు న్యాయం ఇదేనా!

బీసీలకు న్యాయం ఇదేనా!

నా ప్రశ్నలకు సమాధానాలిచ్చే దమ్ముందా? 

వైసీపీ నేతలకు పంచుమర్తి అనురాధ సవాల్‌ 

విజయవాడ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు న్యాయం చేయడమంటే ఇదేనా... జగన్‌ ప్రభుత్వంలో లోపాలపై తన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా అంటూ వైసీపీ నాయకులకు టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ సవాల్‌ విసిరారు. మంగళవారం ఆమె పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీల ఆర్థిక అభివృద్ధికి టీడీపీ బాటలు వేస్తే.. అదే బీసీల వెన్నెముకను జగన్‌రెడ్డి విరిచేశారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు చంద్రబాబునాయుడు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. జగన్‌ వచ్చి 24 శాతానికి తగ్గించి 16 వేల మంది బీసీలను నాయకత్వానికి దూరం చేసిన సంగతి వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్‌కు చెందిన రూ. 18,266 వేల కోట్ల నిధులను దారి మళ్లించి బీసీలను బిచ్చగాళ్లుగా మార్చుతున్నారని దుయ్యబట్టారు. బీసీల ఆర్థిక అభివృద్ధికి టీడీపీ అమలు చేసిన ఆదరణ పథకం కింద చేతివృత్తులవారి కోసం కొనుగోలు చేసిన పనిముట్లను తుప్పు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కార్మికుల కోసం చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5 కే భోజనం పెడితే జగన్‌ తినే పళ్లాన్ని లాగేశారంటూ ఽధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు ముగ్గురు బీసీలకు టీటీడీ చైర్మన్‌ పదవినిస్తే జగన్‌ తన సొంత బాబాయికి ఇచ్చుకున్నాడని, 2 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న 81 బీసీ కులాలను నేటికీ పట్టించుకోవడం లేదని, బీసీలను ఉద్ధరించడమంటే ఇదేనా? అంటూ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అమలు చేసిన విదేశీ విద్య విధానాన్ని జగన్‌రెడ్డి నిలిపివేశారని, రెండున్నరేళ్లలో ఎంతోమంది బీసీ మహిళలను హతమారిస్తే సీఎం జగన్మోహన్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని పంచుమర్తి అనురాధ విమర్శించారు.                                          

Updated Date - 2021-08-25T06:44:05+05:30 IST