అధిక్కారం

ABN , First Publish Date - 2021-02-06T06:20:48+05:30 IST

అధిక్కారం

అధిక్కారం

టీడీపీ బలపర్చిన అభ్యర్థులుగానే గెలవండి

గెలిచాక వైసీపీలో చేరండంటూ బెదిరింపులు

అధికారం ఉంటే అన్ని పనులు చేయించుకోవచ్చంటూ ఎర

గెలుపు అవకాశాలున్న టీడీపీ నాయకులకు వైసీపీ వల

గుడివాడ నియోజకవర్గంలో మరీ ఎక్కువగా..

పెడన, మైలవరంలో ఎన్నికల పేరుచెప్పి వసూళ్లు

అధికారుల పక్షపాత ధోరణి

గుడివాడ నియోజకవర్గంలోని సీపూడి సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన గుంజా విజయ్‌కుమార్‌ టీడీపీ ప్రభుత్వ హయాంలో కేడీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఇప్పటివరకు  వైసీపీలో అఽధికారికంగా చేరలేదు. ఏకగ్రీవమయ్యే సూచన ఉండటంతో ఆయన్ను వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. 

రామనపూడి పంచాయతీలో టీడీపీ సానుభూతిపరుడు మీగడ మురళీని వైసీపీ నాయకులు తమ అభ్యర్థిగా తీసుకెళ్లి నామినేషన్‌ దాఖలు చేయించారు. అప్పటికే వైసీపీ తరఫున పోటీ చేసిన మసిముక్కు సత్యనారాయణను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సిద్ధాంతంలో  సర్పంచ్‌గా నామినేషన్‌ దాఖలు చేసిన జాస్తి పండుబాబు, ఆయన సోదరుడు జాస్తి పిచ్చేశ్వరరావు గతంలో టీడీపీ తరఫున గ్రామంలో చురుగ్గా ఉండేవారు. తాజాగా వైసీపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. నేటికీ పండుబాబు, పిచ్చేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకోకపోవడం గమనార్హం. వీరిద్దరూ ప్రస్తుతం సర్పంచ్‌లుగా నామినేషన్‌ వేశారు. వీరిద్దరూ కాకుండా సర్పంచ్‌ బరిలో నిలిచిన విస్సా నాని తాను సైతం వైసీపీ తరఫున బరిలో ఉన్నానని పేర్కొంటున్నాడు. 

శేరీ వేల్పూరు, చిరిచింతలలోనూ వైసీపీ తరఫున రంగంలోకి దిగిన వారిని బుజ్జగించి.. టీడీపీ తరఫున నామినేషన్‌ వేసిన వారిని తమవైపు తిప్పుకొంటున్నారు. 

చౌటపల్లిలో ఎంపీటీసీ పదవి కావాలంటే.. టీడీపీ వారు సర్పంచ్‌ పదవి తమకు వదిలేయాలని వైసీపీ నాయకులు బేరాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి/గుడివాడ : ఓటమి భయంతో వైసీపీ నేతలు అన్ని అడ్డదారులూ తొక్కుతున్నారు. ఇన్నాళ్లూ ప్రలోభాలు.. బెదిరింపులతో ప్రతిపక్ష అభ్యర్థులను లొంగదీసుకుంటున్న అధికార పార్టీ నేతలు తాజాగా గెలుపు తమదే అనిపించుకునేందుకు కొత్త ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ బలంగా ఉన్న పంచాయతీల్లో ఏం చేసినా ప్రయోజనం లేదని భావించి బుజ్జగింపుల పర్వానికి తెరదీశారు. టీడీపీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారితో ‘టీడీపీ మద్దతుతోనే గెలవండి.. గెలిచాక వైసీపీ కండువా కప్పుకోండి..’ అని వేడుకుంటున్నారు. ‘ప్రతిపక్ష పార్టీ సర్పంచులుగా ముద్రపడితే మీకు ఎలాంటి పనులూ కావు. అదే వైసీపీ వ్యక్తులుగా ఉంటే లక్షలాది రూపాయల టెండర్లను దక్కించుకోవచ్చు. ఏ పని కావాలన్నా ఇట్టే చేయించుకోవచ్చు.’ అని హితబోధ చేస్తున్నారు. గుడివాడ రూరల్‌ మండలంలోని పలు పంచాయతీల్లో ఈ పరిస్థితి నెలకొంది. మంత్రి కొడాలి నాని అనుచరులు ఆయా పంచాయతీల్లో పర్యటిస్తూ సర్పంచ్‌ అభ్యర్థులతో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. గుడివాడ రూరల్‌ మండలంలోని 16 పంచాయతీల్లో పైచేయి సాధించేందుకు మంత్రి వర్గీయులు ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే దొండపాడు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 15 గ్రామాల్లో తొమ్మిదికిపైగా పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. టీడీపీ తరఫున నామినేషన్‌ వేసిన అభ్యర్థులను తమ పార్టీలోకి ఆహ్వానించి వైసీపీలో ఉన్న వారిని రంగం నుంచి తప్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 

వైసీపీ కార్యకర్తల్లా అధికారులు

గుడివాడ డివిజన్‌లో కొన్ని మండలాల అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముదినేపల్లి పంచాయతీలో టీడీపీ బలపర్చిన అభ్యర్థికి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి ఆర్డీవో మొదలు మండలస్థాయి అధికారుల వరకు నానా తిప్పలు పెట్టారు. నామినేషన్‌ దాఖలుకు సమయం మించిపోతుందని వేడుకున్నా కుల ధ్రువీకరణ పత్రాన్ని రిజిస్టర్‌ పోస్టులో పంపి అధికారులు తమ పక్షపాతాన్ని చాటుకున్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలిదిండి మండలంలోని పలు పంచాయతీల్లో మండల స్థాయి అధికారులు లోపాయికారిగా వైసీపీకి ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. 

ఎన్నికల పేరుతో వసూళ్లు

మైలవరం నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధి బామ్మర్ది పంచాయతీ ఎన్నికల పేరుతో క్వారీ యజమానుల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. ఒక్కో క్వారీ యజమాని నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.కోటి వసూలు చేసినట్లు సమా చారం. పెడన నియోజకవర్గంలో పరిస్థితి మరో రకంగా ఉంది. ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధి.. ఎవరు ఎక్కువ సొమ్ము ముట్టజెబితే వారికి సర్పంచ్‌ సీటు ఏకగ్రీవమని స్పష్టం చేస్తున్నారు. దీంతో సీటు ఆశించే ఔత్సాహికులు పోటీపడి మరీ ప్రయత్నాలు చేస్తున్నారు. 

Updated Date - 2021-02-06T06:20:48+05:30 IST