డొంక కదులుతోంది!

ABN , First Publish Date - 2021-12-30T06:37:28+05:30 IST

ఇతర రాష్ట్రాల రవాణా వాహనాల అక్రమ రిజిస్ర్టేషన్ల డొంకంతా కదులుతోంది.

డొంక కదులుతోంది!

ప్రైవేటు హై ఎండ్‌ బస్సులపైనా సందేహాలు

ప్రైవేటు ట్రావెల్‌ బస్సుల చాసిస్‌ నెంబర్ల తనిఖీకి ఆదేశం 

ట్యాంకర్ల అక్రమ రిజిస్ర్టేషన్లలో నెంబర్‌ సిరీస్‌ గుర్తింపు 

ఏపీ 39 యూఏ, యూజడ్‌ సిరీస్‌తో అక్రమ రిజిస్ర్టేషన్లు 

ఈ సిరీస్‌ వాహనాలు సీజ్‌ చేయాలని ఆదేశం 


ఇతర రాష్ట్రాల రవాణా వాహనాల అక్రమ రిజిస్ర్టేషన్ల డొంకంతా కదులుతోంది. ఈ వ్యవహారం ఆయిల్‌ ట్యాంకర్లకే పరిమితం కాలేదని తెలుస్తోంది. ప్రైవేటు ఆపరేటర్ల చేతిలో ఉన్న కోటి రూపాయల ఖరీదైన ఓల్వో, బెంజ్‌ బస్సులను కూడా ఇదే తరహాలో నెంబర్‌ ట్యాంపరింగ్‌ చేసి ఉండవచ్చునని రవాణా శాఖ సందేహిస్తోంది. అందుకే విజయవాడతోపాటు మరికొన్ని నగరాలకు చెందిన ప్రైవేటు ఆపరేటర్లు కొద్దికాలం క్రితం ఈశాన్య రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినట్టు చూపుతున్న హై ఎండ్‌ బస్సుల రిజిస్ర్టేషన్లపై కూడా ఆ శాఖ దృష్టి సారించింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో ప్రైవేటు ఆపరేటర్ల దగ్గర ఉన్న ఓల్వో, బెంజ్‌ బస్సుల చాసిస్‌ నెంబర్లను తనిఖీ చేయాలని రవాణాశాఖ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. కరోనా సమయంలో ప్రైవేటు బస్సుల ఆపరేషన్‌ పూర్తిగా నిలిచిపోయింది. అప్పుడు దాదాపు రెండు వందలకు పైగా స్లీపర్‌ బస్సులకు రిజిస్ర్టేషన్లు జరిగాయి. ఆ అంశంపై కూడా రవాణా శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ బస్సులన్నీ నిజంగా ఉన్నాయా? పాత వాహనాలకు లైఫ్‌ ఇచ్చేందుకు దొంగచాసిస్‌ నెంబర్లను సృష్టించారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ప్రైవేటు ఆపరేటర్ల చేతిలో ఉన్న హైఎండ్‌ బస్సులన్నింటినీ తనిఖీ చేయాలని భావిస్తున్నారు. 


ఏపీ 39 యూఏ, యూజడ్‌ సిరీస్‌ వాహనాలు సీజ్‌  

ఈశాన్య రాష్ట్రాలకు చెందినవిగా చెబుతున్న ట్యాంకర్ల అక్రమ రిజిస్ర్టేషన్ల వ్యవహారంలో  నెంబర్‌ సిరీస్‌ను రవాణా శాఖ గుర్తించింది. ఏపీ 39 యూఏ నుంచి ఏపీ 39 యూజడ్‌ సిరీస్‌ వరకు అక్రమ రిజిస్ర్టేషన్‌ జరిగినట్టు రవాణా శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నెంబర్‌ సిరీస్‌తో కూడిన వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్‌ చేయాలని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. ప్రధానంగా చెక్‌ పోస్టుల దగ్గర నిఘా పెట్టి, ఈ సిరీస్‌తో కనిపించే  వాహనాలను అక్కడికక్కడే సీజ్‌ చేయాలని ఆదేశించారు. 


అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచే ‘వాహన్‌’లోకి దొంగ వాహనాలు 

జిల్లాకు చెందిన దొంగ వాహనాల సూత్రధారికి అరుణాచల్‌ప్రదేశ్‌తో అక్రమ లింకులు ఉన్నట్టు రవాణాశాఖ విచారణాధికారులు గుర్తించారు. అక్కడ రవాణాశాఖలో పని చేసే ప్రోగ్రామర్లతో, జిల్లాకు చెందిన సూత్రధారికి సంబంధాలున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఆయా సమయాల్లో నడుస్తున్న వాహనాల చాసిస్‌ నెంబర్ల సిరీస్‌ను అక్కడి ప్రోగ్రామర్లు పసిగట్టి.. ఆ చాసిస్‌ సిరీస్‌లోని ఆంగ్ల అక్షరాలను యథాతథంగానే ఉంచి, నెంబర్లను మాత్రం అటు, ఇటు మార్చి వాహన్‌ సైట్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఇలా కేంద్ర వెబ్‌సైట్‌ ‘వాహన్‌’లో అప్‌లోడ్‌ అవ్వటం వల్ల అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ఎన్వోసీలు కూడా జారీ అవుతున్నాయి. ఇలా ఎన్వోసీలు జారీ అవడం, వాహన్‌లో డేటా ఉండటంతో నెల్లూరు జిల్లా గూడూరులో దొంగ చిరునామాలతో తేలిగ్గా రిజిస్ర్టేషన్లు చేయగలిగారు. 

Updated Date - 2021-12-30T06:37:28+05:30 IST