దహన సంస్కారాలకు ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-05-18T06:12:39+05:30 IST

కరోనా రెండో దశ ఉధృతితో ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలోనే భౌతికకాయాల దహన సంస్కారాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

దహన సంస్కారాలకు ఇక్కట్లు
నున్నలో వాగు ఒడ్డున హిందూ శ్మశాన వాటిక

విజయవాడ రూరల్‌, మే 17 : కరోనా రెండో దశ ఉధృతితో ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలోనే భౌతికకాయాల దహన సంస్కారాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కరోనా సోకి మృతి చెందిన వారిని గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకుంటున్న ఘటనలూ రోజూ తారసపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో  శాశ్వత ప్రాతిపదికన అధునాతన శ్మశాన వాటికల అవశ్యంపై చర్చ జరుగుతోంది. ఎవరైనా కన్ను మూస్తే సొంత గ్రామంలో అంత్యక్రియలకు నోచుకోని దుర్భర పరిస్థితి నెలకొంది.  గ్రామా ల్లో చెరువు కట్టలు, వాగు ఒడ్డు లేదా రోడ్డు వెంబడి ఖాళీ స్థలాల్లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగరానికి అతి సమీపంలోని విజయవాడ రూరల్‌ మండలంలోని ఏ గ్రామంలోనూ పూర్తి స్థాయి శ్మశాన వాటికలు లేవు.  దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలు దహన సంస్కారాలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది.  నున్నతోపాటు పాతపాడు, పీ నైనవరం, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి తదితర గ్రామాల్లో  చెరువు కట్టలు, వాగు ఒడ్డులలోనే అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఏటా శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తున్నా, తూతూ మంత్రంగానే పనులు చేస్తున్నారు తప్ప, రుద్రభూములు అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాలో కొన్ని చిన్న గ్రామాల్లో సైతం అధునాతన శ్మశాన వాటికలను ఏర్పాటు చేశారు.  రూరల్‌ మండలంలోని పెద్ద గ్రామాలు సైతం అందుకు నోచుకోకపోవడం గమనార్హం. మండలంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ, శ్మశాన వాటికలకు మాత్రం స్థలాలను కేటాయించని పరిస్థితి నెలకొంది. నున్నలో హిందూ శ్మశాన వాటికకు స్థలం లేకపోవడంతో, వికాస్‌ కాలేజీ రోడ్డులోని పెద్ద వాగు ఒడ్డున తాత్కాలికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పాతపాడు, పీ నైనవరం, కుందావారి కండ్రిక, అంబాపురం, జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లిలోనూ చెరువుల్లోనే శ్మశాన వాటికలను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. గ్రామాల్లోకి భౌతికకాయాలను తీసుకువచ్చినా వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో చేసేది లేక విజయవాడ తీసుకువెళ్లి స్వర్గపురి లేదా ఈఎ్‌సఐ వద్ద ఉన్న శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించుకోవాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించి శాశ్వత ప్రాతిపదికన అధునాతన శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-18T06:12:39+05:30 IST