పాత కేసులుంటేనే అరెస్టు!

ABN , First Publish Date - 2021-02-08T06:15:05+05:30 IST

పాత కేసులుంటేనే అరెస్టు!

పాత కేసులుంటేనే అరెస్టు!

యువతిపై వేధింపుల కేసులో కైకలూరు పోలీసుల కొత్త కోణం

ఇప్పటి వరకు నిందితుడిని అరెస్టు చేయని వైనం

విజయవాడ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): అమ్మాయిలు, మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నాం. వాళ్లను వేధిస్తే దిశ చట్టం కింద అరెస్టు చేసి జైళ్లకు పంపుతాం. దిశ చట్టానికి రూపకల్పన చేసినప్పుడు ప్రభుత్వం చెప్పిన మాటలివి. ఒక యువకుడి వేధింపుల వల్ల ఓ యువతి చావు వరకు వెళ్తే నిందితుడి అరెస్టు విషయంలో కైకలూరు పోలీసులు కొత్త కోణం తీసుకొచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై పాత కేసులు ఉంటేనే అరెస్టు చేస్తామని తెగేసి చెబుతున్నారు.  కైకలూరు మండలం అటపాకకు చెందిన డిగ్రీ విద్యార్థినిని ఆమె ఇంటికి సమీపాన ఉండే వివాహితుడైన విజయ్‌ అనే యువకుడు తరచుగా వేధిస్తున్నాడు. ఉన్నత విద్య కోసం యువతి విశాఖపట్నంలోని ఓ విద్యాసంస్థలో చేరింది.  అక్కడికీ వెళ్లి వేధింపులు సాగించాడు. విషయాన్ని యువతి తల్లికి చెప్పింది. ఆమె విజయ్‌ తండ్రికి చెప్పాక కొంతకాలం వేధింపులను ఆపాడు. తాను చెప్పినట్టు యువతి వినకపోవడంతో విజయ్‌ ఆమెపై దుష్ప్రచారం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు అనడంతో ఆ యువతి గడచిన నెల 17వ తేదీన ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై కైకలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి కొత్తకొత్త కోణాలను వినిపిస్తున్నారు. విజయ్‌ని స్టేషన్‌కి పిలిపించి మాట్లాడిన పోలీసులు తర్వాత ఇంటికి పంపేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే విజయ్‌పై ఇంతకుముందెన్నడూ కేసులు లేవని, తాము చేసిన విచారణలో పాత కేసులు ఏమీ లేకపోడంతో అరెస్టు చేయలేమని సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేయకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, ఓ యువనేత రంగంలోకి దిగి కథను మార్చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్యకు యత్నించిన యువతి వాంగ్మూలంలో జరిగిన పరిణామాలను వివరించి, వేధించే వ్యక్తి పేరు, చిరునామా చెప్పినా పాత కేసులను వంక చూపించి అరెస్టు చేయలేమని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.


Updated Date - 2021-02-08T06:15:05+05:30 IST