విలీన విద్య
ABN , First Publish Date - 2021-10-25T06:31:39+05:30 IST
ఇది విలీన విద్యా సంవత్సరం.

నవంబరు ఒకటి నుంచి జిల్లాలో నూతన విద్యావిధానం
ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమయ్యే ఎయిడెడ్ పాఠశాలలు 345
పదోన్నతులు, సర్దుబాటు తరువాతే 3,4,5 తరగతుల విలీనం
ఇది విలీన విద్యా సంవత్సరం. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయడంతో జిల్లాలో 345 పాఠశాలలు మూత పడనున్నాయి. ఈ పాఠశాలల్లోని విద్యార్థులను నెలాఖరులోగా ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. ఉపాధ్యాయులను నవంబరు ఆరో తేదీనాటికి బదిలీలు చేయనున్నారు. వీరంతా ఇక ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేయాల్సి ఉంటుంది.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : జిల్లాలో పాఠశాలల విలీనం ద్వారా నవంబరు ఒకటో తేదీ నుంచి నూతన విద్యావిధానం అమలు కానుంది. మూతపడిన 350 ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 850 మంది టీచర్లకు సంబంధించిన సీనియారిటీ జాబితాలను తయారు చేసే పని ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించడం, వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించడం, ఆయా యాజమాన్యాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ తుది జాబితాలను ప్రకటించడం వంటి పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. నవంబరు ఒకటో తేదీన ఆయా పాఠశాలలవారీగా సర్దుబాటు చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులను ప్రకటించి, వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తారు. ఆరో తేదీన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఏడోతేదీన బదిలీ అయిన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియతో ఎయిడెడ్ పాఠశాలల ఉనికి జిల్లాలో సమాప్తం కానుంది.
ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు
జిల్లాలో నూతన విద్యావిధానం నవంబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పలు ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను 250 మీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో కలుపుతారు. ఇలా జిల్ల్లాలోని 195 ప్రాథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులను 180 ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. ఆ తరువాత ఉపాధ్యాయుల సర్దుబాటు మొదలవుతుంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
1, 2 తరగతులకు 1:30 నిష్పత్తిలో ఉపాధ్యాయులు
ప్రాథమిక పాఠశాలల్లోని ఒకటి, రెండు తరగతులను అంగన్‌వాడీతో కలుపుతారు. వాటిని ఫౌండేషన్ స్కూల్స్‌గా పిలవనున్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో కలిపిన తరువాత ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ప్రతి 30 మందికి ఒక టీచరు ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఇలా విలీనం చేసిన తరువాత జిల్లాలో 195 ప్రాథమిక పాఠశాలలు కనుమరుగుకానున్నాయి. ఉన్నత పాఠశాలల్లో మూడు నుంచి పదో తరగతి వరకు ప్రతి టీచర్‌కూ వారంలో 32 పిరియడ్లు ఉండేలా టైమ్ టేబుల్ రూపొందిస్తారు. మూడు నుంచి ఐదు తరుగతుల వారికి ఒక్కో తరగతికి 15 మంది విద్యార్థులుంటే ఒక సెక్షన్‌గా పరిగణిస్తారా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టతలేదు. ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు అయిన టీచర్ల సర్వీసు మేటర్‌ను ఇక నుంచి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం చూస్తారు. జూనియర్ ఎస్‌జీటీలను ఒకటి, రెండు తరగతులకు ఉంచి, సీనియర్ ఎస్‌జీటీలను ఉన్నతపాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు. సీనియర్ ఎస్‌జీటీలకు ఉన్నత పాఠశాలకు వెళ్లే అర్హత లేకుంటే, బీఈడీ అర్హత ఉన్న జూనియర్ ఎస్‌జీటీని ఉన్నత పాఠశాలకు పంపుతారు. ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటుకు తరగతి గదులు చాలకుంటే మూడు నుంచి ఐదు వరకు పాత పాఠశాలలోనే తరగతులు నిర్వహిస్తారు. అయితే వీటిని ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులే పర్యవేక్షిస్తారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల సర్దుబాటు, తరగతి గదులు తదితర అంశాలను డీఈవో పర్యవేక్షించి, నవంబరు ఒకటి నుంచి కొత్త విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది. ఎయిడెడ్ టీచర్ల బదిలీల తరువాతే ప్రాథమిక పాఠశాలల టీచర్లను సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.