సీఎం..గణపతి సచ్చిదానందస్వామి కాళ్లు మొక్కడం సిగ్గుచేటు

ABN , First Publish Date - 2021-10-19T06:31:54+05:30 IST

సీఎం..గణపతి సచ్చిదానందస్వామి కాళ్లు మొక్కడం సిగ్గుచేటు

సీఎం..గణపతి సచ్చిదానందస్వామి కాళ్లు మొక్కడం సిగ్గుచేటు

హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య

పాయకాపురం, అక్టోబరు 18: ముఖ్యమంత్రి జగన్‌ కబ్జాల స్వామి గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లి కాళ్లు మెక్కడం సిగ్గుచేటని, ఇది రాష్ట్ర ప్రజలను అవమానపరచటమే అవుతుందని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అధికారికంగా ఒక మతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పీఠాధిపతి వద్దకు వెళ్లడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. దేశ లౌకిక విధానాలకు తిలోదకాలు ఇవ్వటమే అవుతుందని స్పష్టం చేశారు. సచ్చిదానంద అసలు పేరు జి. సత్యనారాయణ అని, అనంతపురం జిల్లాలో ఒకప్పుడు పోస్టుమ్యాన్‌గా ఉండేవారని తెలియజేశారు. పోస్టుమ్యాన్‌ ఉద్యోగం ఊడిపోయాక మైసూర్‌ దగ్గర గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఏర్పరచి, పక్కనే ఉన్న ఇతరుల భూమిని కూడా ఆక్రమించి, ఫోర్జరీ చేసిన కారణంగా 2008 మార్చిలో డాక్టర్‌ అనిల్‌ ఫిర్యాదుతో పోలీసులు ఆయనను ఆశ్రమంలో అరెస్ట్‌ చేసి మైసూర్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారని వివరించారు. అలాంటి దొంగ స్వామి వద్దకు ముఖ్యమంత్రులు వెళ్తే సామాన్యుడికి ఏరకమైన సంకేతాలు అందుతాయని, ప్రభుత్వం దొంగలను ప్రోత్సహించినట్లు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పి, ఇలాంటి భూ ఆక్రమణ దారుల భరతం పట్టే కార్యక్రమాలు చేపట్టాలని నార్నె వెంకటసుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-19T06:31:54+05:30 IST