ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. వైసీపీ ఇసుక దోపిడీ!

ABN , First Publish Date - 2021-11-28T05:59:10+05:30 IST

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. వైసీపీ ఇసుక దోపిడీ!

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ..  వైసీపీ ఇసుక దోపిడీ!
జనసేన సభ్యత్వ కిట్లను అందిస్తున్న నాదెండ్ల మనోహర్‌

రాష్ట్రంలో నిద్రావస్థలో వ్యవస్థలు..వర్క్‌ఫ్రం హోం సీఎంగా జగన్‌

పంచాయతీల నిధులనూ దారి మళ్లించారు:  నాదెండ్ల మనోహర్‌

అవనిగడ్డ టౌన్‌, నవంబరు 27: ప్రకృతి వనరులను నాశనం చేస్తూ నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇసుక మేటలను సీఎం జగన్మోహన్‌ రెడ్డి అనుయాయులు ఆదాయవనరుగా మార్చుకుని అక్రమార్జన చేస్తున్నారని, అంబులెన్సులు, ఆర్టీసీ బస్సులకు కూడా దారి ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కృష్ణా కరకట్టపై ఇసుక దోపిడీ చేస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మనోహర్‌ మాట్లాడారు. అంతకు ముందు అవనిగడ్డ రహదారిపై జనసేన నేతలతో కలసి శ్రమదానం చేసి గోతులు పూడ్చారు. రాష్ట్రంలో వ్యవస్థలు నిద్రావస్థలో ఉన్నాయని, ఓ వైపు వరదలతో ప్రజలు, ఇసుక మాఫియా కోరల్లో సామాన్యులు, భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, పాలించాల్సిన ముఖ్యమంత్రి వర్క్‌ఫ్రమ్‌ హోం సీఎంగా మారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన కీలకపాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వం అక్రమ కేసులతో స్థానిక సంస్థలను గెలుచుకుందన్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన 14, 15వ ఆర్థి సంఘం నిధులను ప్రభుత్వం దొడ్డిదారిన దారి మళ్లించిందన్నారు. కార్యకర్తలు తెగువతో పనిచేస్తే జనసేన గెలవబోయే నియోజకవర్గాల్లో అవనిగడ్డ మొదటి వరుసలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు సభ్యత్వ కిట్లను అందజేశారు. టీడీపీ, వైసీపీలకు చెందిన పలువురు వార్డుసభ్యులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నాదెండ్ల మనోహర్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొలుత పులిగడ్డ వంతెన నుంచి జనసైనికులు మోటార్‌ సైకిల్‌ ర్యాలీతో మనోహర్‌కు స్వాగతం పలికారు. మత్తి వెంకటేశ్వరరావు, బాసు నాంచారయ్య నాయుడు, మండలి రాజేష్‌, రాయపూడి వేణుగోపాలరావు, చన్నగిరి సత్యనారాయణ, గాజుల శంకరరావు, కొండవీటి సునీత, బండ్రెడ్డి మల్లికార్జునరావు, పద్యాల వెంకటప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T05:59:10+05:30 IST