పురాధీశులెవరో..

ABN , First Publish Date - 2021-03-14T05:50:23+05:30 IST

పురాధీశులెవరో..

పురాధీశులెవరో..
లయోల కళాశాలలో లెక్కింపునకు ఏర్పాట్లు

మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు నేడే

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

విజయవాడ కార్పొరేషన్‌కు లయోల కళాశాలలో లెక్కింపు

బందరుకు కృష్ణా యూనివర్సిటీలో..

నూజివీడు, పెడన, నందిగామ, ఉయ్యూరు, తిరువూరుల్లోనూ ప్రత్యేక  ఏర్పాట్లు

అనుమతి ఉన్న ఏజెంట్లకే ప్రవేశం

విజయవాడలో మూడు రౌండ్లలో ఫలితాల వెల్లడి

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి నో

మరికొద్ది గంటల్లో మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభంకానుంది. బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైన భవితవ్యం బయటకు రానుంది. గెలుపెవరిది? ఓడిపోయేదెవరు?  ఈ ప్రశ్నలకు బ్యాలెట్‌ పత్రాలు ఆదివారం జవాబు చెప్పనున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలే గట్టెక్కిస్తుందని వైసీపీ ధీమాతో ఉంటే.. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమ విజయానికి దోహదపడుతుందని టీడీపీ భావిస్తోంది. ఇరు ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇస్తామని జనసేన-బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఎవరి బలాలు వారివే.. ఎవరి లెక్కలు వారివే.. కానీ, చివరికి విజయ తీరాల్లో మిగిలేది ఏ పార్టీ? ఎన్ని సీట్లు? తెలియడానికి ఇంకా కొద్ది సమయమే ఉంది.

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం/విజయవాడ  : పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది. ఈనెల 10వ తేదీన జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్లు, నూజివీడు, పెడన పురపాలక సంఘాలు,  తిరువూరు, నందిగామ, ఉయ్యూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ ఇంతియాజ్‌ శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పటిష్ట బందోబస్తు నడుమ పారదర్శకంగా కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తామని చెప్పారు.

అనుమతి ఉన్న ఏజెంట్లకే ప్రవేశం

కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతి ఉన్న ఏజెంట్లకే ప్రవేశం ఉంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంటును అనుమతిస్తారు.  సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రి తీసుకెళ్లకుండా ప్రధాన ద్వారం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్లను డిపాజిట్‌ చేయడానికి అక్కడ ప్రత్యేక కౌంటర్‌ను నెలకొల్పారు. విజయవాడ కార్పొరేషన్‌కు సంబంధించి ఆంధ్రా లయోల కళాశాలలో రెండు బ్లాకులు ఏర్పాటు చేశారు. మొదటి బ్లాకులో 15, రెండో బ్లాకులో 8 మొత్తం 23 కౌంటింగ్‌ కేంద్రాలు ఉంటాయి. మొదటి బ్లాకులో ఏడు కౌంటింగ్‌ టేబుళ్లు, రెండో బ్లాకులో 8 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. 

ఓట్ల లెక్కింపు ఎలా?

తక్కువ ఓట్లు ఉన్న డివిజన్ల ఫలితాలు త్వరగా వెల్లడవుతాయి. ఎక్కువ ఓటర్లు ఉన్న డివిజన్ల ఫలితాల్లో మాత్రం కాస్త ఆలస్యమవుతుంది. మొదటి ఫలితం ఉదయం 11 గంటలకు రాగలదని భావిస్తున్నారు. మొత్తం మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపును పూర్తిచేస్తారు. మొదటి రౌండ్‌లో 23 డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయి. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 23, 25, 27, 29, 31, 33, 37 డివిజన్ల ఓట్ల లెక్కింపును న్యూ కన్‌స్ట్రక్షన్‌ భవనంలో లెక్కిస్తారు. 41, 43, 45, 47, 49, 51, 53, 57 డివిజన్ల ఓట్లను ఆడిటోరియంలో లెక్కిస్తారు. రెండో రౌండ్‌లో 23 డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయి. న్యూ కన్‌స్ట్రక్షన్‌ భవనంలో 2, 4, 6, 8, 10, 17, 19, 21, 24, 26, 28, 30, 39, 35, 38 డివిజన్ల ఓట్లను లెక్కిస్తారు. ఆడిటోరియంలో 42, 44, 46, 55, 59, 61, 63, 58 డివిజన్ల ఓట్లను లెక్కిస్తారు. మూడో రౌండ్‌లో 18 డివిజన్ల ఫలితాలు బయటకు వస్తాయి. 12, 14, 16, 18, 20, 22, 32, 34, 36, 40 డివిజన్ల ఓట్లను న్యూ కనస్ట్రక్షన్‌ భవనంలో, 48, 50, 52, 54, 56, 60, 62, 64 డివిజన్ల ఓట్ల లెక్కింపు ఆడిటోరియంలో జరుగుతుంది.

నగరంలో 144 సెక్షన్‌

ప్రస్తుతం నగరంలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లయోల కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 11 కేంద్రాల్లో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ రెంటికీ తగ్గట్టుగా బందోబస్తు మ్యాప్‌ను పోలీసులు సిద్ధం చేశారు. నగరం మొత్తం 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ఫలితాలు వెల్లడయ్యాక విజయం సాధించిన అభ్యర్థులు ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని పోలీసులు ముందే హెచ్చరించారు. లయోల కళాశాల చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాలపై నిఘా పెడుతున్నారు. మరోపక్క కౌంటింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు ఇతర వ్యక్తులను అనుమతించకుండా నిబంధనలు విధించారు. 

జిల్లాలో కౌంటింగ్‌ ఇలా..

మచిలీపట్నం కార్పొరేషన్‌కు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. రెండు బ్లాకుల్లో 17 టేబుళ్లను ఏర్పాటు చేశారు. నూజివీడు పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్‌ సారథి ఇంజనీరింగ్‌ కళాశాలలో, పెడన పురపాలక సంఘం కౌంటింగ్‌ పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతాయి. తిరువూరు, ఉయ్యూరు, నందిగామ నగర పంచాయతీలకు స్థానికంగా ఉన్న పాఠశాలల్లో ఏర్పాట్లు చేశారు. తొలుత బ్యాలెట్‌ పత్రాలను 25 చొప్పున కట్టలుగా కడతారు. అనంతరం వాటిని లెక్కించి విజేతల వివరాలు, ఆయా పార్టీల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు వెల్లడిస్తారు. 

టెన్షన్‌ టెన్షన్‌

ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడటంతో అటు అభ్యర్థుల్లోనూ, ఇటు వారిపై పందేలు కట్టిన వారిలోనూ టెన్షన్‌ ఎక్కువైంది. ఇప్పటికే అభ్యర్థులంతా గెలుపోటముల విషయంలో ఒక అంచనాకు వచ్చారు. ఆయా డివిజన్లలో పోలైన ఓట్లను బట్టి లెక్కలు వేసుకున్నారు. అభ్యర్థులు వేసుకున్న అంచనాలకు, బెట్టింగ్‌ బాబులకు ఫలితాలు సమాధానం చెప్పనున్నాయి. 

              1 8న మేయర్‌, డెప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక

జిల్లాలోని మునిసిపల్‌ కార్పొరేషన్‌,  మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు మేయర్‌, డెప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక ఈనెల 18వ తేదీన జరుగుతుంది. గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చి ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని కోరతారు. ఇందుకోసం ప్రిసైడింగ్‌ అధికారులను నియమించారు. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌, డెప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా నిర్వహిస్తారు. మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా జేసీ కె.మాధవీలత వ్యవహరిస్తారు.  నూజివీడు పురపాలక సంఘానికి సబ్‌ కలెక్టర్‌, పెడన పురపాలక సంఘానికి మచిలీపట్నం ఆర్డీవో, ఉయ్యూరు నగర పంచాయతీకి గుడివాడ ఆర్డీవో, నందిగామ నగర పంచాయతీకి డీఆర్‌డీఏ పీడీ, తిరువూరు నగర పంచాయతీకి జిల్లా యువజన సంక్షేమశాఖ అధికారి ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. 




Updated Date - 2021-03-14T05:50:23+05:30 IST