జగ్గయ్యపేట, కొండపల్లి పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2021-11-02T06:30:20+05:30 IST

జగ్గయ్యపేట, కొండపల్లి పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

జగ్గయ్యపేట, కొండపల్లి పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ.. 6న పరిశీలన..8న ఉపసంహరణ..

 15న ఎన్నిక..17న కౌంటింగ్‌

జగ్గయ్యపేటలో వేడెక్కిన రాజకీయం..21 ఏళ్ల తర్వాత బీసీలకు మళ్లీ చాన్స్‌..

శివార్ల విలీనం తర్వాత తొలి ఎన్నికలు

జగ్గయ్యపేట, నవంబరు 1: జగ్యయ్యపేట, కొండపల్లి పురపాలక సంఘాల ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 6న పరిశీలన, 8న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా ప్రకటిస్తారు. 15న ఎన్నికలు నిర్వహిస్తారు. 16న రీపోలింగ్‌ ఉంటే నిర్వహిస్తారు. 17న కౌంటింగ్‌, ఫలితాలు వెల్లడిస్తారు. 

పేటలో రాజకీయ వేడి

నోటిఫికేషన్‌ విడుదలతో జగ్గయ్యపేటలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పట్టణంలోని తొర్రగుంటపాలెం, ఆటోనగర్‌ల విలీనం తర్వాత కోర్టు అవాంతరాలు సమసిపోవటంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2000 సంవత్సరం తర్వాత చైర్మన్‌గా బీసీలకు మళ్లీ చాన్స్‌ దక్కింది. విలీనం తర్వాత పురపాలక సంఘంలో వార్డుల సంఖ్య 31కి చేరింది. 31 వార్డుల్లో 62 పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేశారు. ఒక విడత ఎన్నికల అధికారులకు శిక్షణ పూర్తయింది.  

వార్డుల రిజర్వేషన్లు

24వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ కాగా, ఎస్సీలకు 5 వార్డులు రిజర్వ్‌ అయ్యాయి. 25, 26 వార్డులు ఎస్సీ మహిళకు, 6, 14, 30 వార్డులు ఎస్సీ జనరల్‌కు, బీసీలకు 9 వార్డులు రిజర్వ్‌కాగా, 10, 13, 16, 23 వార్డులు బీసీ మహిళలకు, 11, 15, 17, 18, 22 వార్డులు బీసీ జనరల్‌కు, మహిళలకు 3, 4, 7, 12, 20, 21, 27, 28, 29 వార్డులు, 1, 2, 5, 8, 9, 19, 31 వార్డులు అన్‌ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. పురపాలకసంఘ పరిధిలో 41,681 మంది ఓటర్లు ఉండగా, 19745 మంది పురుషులు, 21,932 మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు.  

టీడీపీ, వైసీపీ మధ్య ముఖాముఖి

టీడీపీ, వైసీపీల మధ్యనే ముఖాముఖి పోటీ జరగనుంది.  పురపాలక సంఘం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి మినహా అన్ని సార్లు కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఒక్కసారి వైసీపీ విజయం సాధించింది. 1987లో పురపాలకసంఘంగా ఏర్పడ్డాక తొలి చైర్మన్‌గా కాంగ్రెస్‌ తరఫున శ్రీరాం బదరీనారాయణ విజయం సాధించారు. 1995లో మహిళలకు రిజర్వ్‌ కాగా కాంగ్రెస్‌ నుంచి హనుమంతు రత్నకుమారి, 2000లో బీసీలకు రిజర్వ్‌ కాగా కాంగ్రెస్‌ తరఫున కొమ్మవరపు వెంకటనారాయణ, 2005లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున శ్రీరాం తాతయ్య విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆయన వర్గం కౌన్సిలర్లు 14 మంది టీడీపీలో చేరటంతో తర్వాత టీడీపీ తరఫున తాతయ్య పినతండ్రి శ్రీరాం సుబ్బారావు చైర్మన్‌ అయ్యారు. తొలిసారి పరోక్ష పద్ధతిలో టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014లో వైసీపీ విజయం సాధించగా తన్నీరు నాగేశ్వరరావు, ఇంటూరి రాజగోపాల్‌లు చైర్మన్లుగా పని చేశారు. టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌, పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరాం తాతయ్య, ప్రభుత్వ విప్‌, వైసీపీ విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడిగా ఉన్న సామినేని ఉదయభానుకు సొంత పట్టణం, త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండడంతో ఎన్నికలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నోటిఫికేషన్‌ రాకముందే రెండు పార్టీలు ముందస్తుగా పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. అభ్యర్థుల వడపోత ప్రారంభించారు. బీజేపీ, జనసేన, వామపక్షాల కార్యాచరణపై స్పష్టత రాలేదు.

చైర్మన్‌ పదవి చేపట్టేందుకు కసరత్తు

కొండపల్లి(ఇబ్రహీపట్నం): కొండపల్లి పురపోరుకు రంగం సిద్ధమైంది. ఇదివరకు ఇబ్రహీంపట్నం, కొండపల్లి రెండు మేజర్‌ పంచాయతీలుగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనాభా ప్రాతిపదికన రెండు గ్రామాలను కలుపుతూ కొండపల్లి పురపాలక సంఘంగా ఏర్పాటు చేసింది. మొత్తం పురపాలక సంఘంలో 57వేల మంది ఓటర్లు ఉన్నారు. 29 డివిజన్లుగా విభజించి 56 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే వారికి మున్సిపల్‌ కమిషనర్‌ శిక్షణా తరగతులు పూర్తి చేశారు. మొట్టమొదటిసారి పురపాలక ఎన్నికలు జరుగుతుండడంతో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. అన్ని డివిజన్లలో బీజేపీ, జనసేన పోటీలో నిలుస్తుండడంతో అధికార పార్టీ ఓటు బ్యాంకు చీలిపోయి లాభం కలుగుతుందని టీడీపీ భావిస్తోంది. కొన్ని డివిజన్‌లో వైసీపీ అభ్యర్థుల సంఖ్య పెరిగి అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. టీడీపీలో బలమైన అభ్యర్థులు పోటీకి వెనుకడగు వేయడంతో నాయకుల్లో ఆందోళన కలిగిస్తుంది. 

Updated Date - 2021-11-02T06:30:20+05:30 IST