మట్టిని మింగేస్తున్నారు
ABN , First Publish Date - 2021-03-21T15:50:19+05:30 IST
అధికారం ఉంది కదా.. అని అధికార పార్టీ నాయకులు అయినకాడికి దండుకుంటున్నారు. సహజ సంపదను ఇష్టానుసారంగా..

మొర్సుమిల్లిలో జోరుగా గ్రావెల్ అక్రమ రవాణా
తిరువూరులో మట్టి, ఇసుక తవ్వకాలు
అధికార పార్టీ నాయకుల దందా
పట్టించుకోని అధికారులు
విజయవాడ: అధికారం ఉంది కదా.. అని అధికార పార్టీ నాయకులు అయినకాడికి దండుకుంటున్నారు. సహజ సంపదను ఇష్టానుసారంగా దోచేస్తున్నారు. కొండల్ని పిండి చేసి గ్రావెల్ అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. అడ్డుకోవాల్సిన అఽధికారులు ఒత్తిళ్లకు, మామూళ్లకు తలొగ్గుతున్నారు.
మైలవరంలో గ్రావెల్ దందా
మైలవరం రూరల్ : మొర్సుమిల్లి గ్రామంలో వైసీపీ నాయకుల గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. గ్రామంలోని వింజంరాయుని గట్టులో ఎక్స్‌కవేటర్ ఏర్పాటుచేసి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పుల గ్రావెల్‌ను అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. గురువారం పట్టపగలే వింజంరాయుని గట్టు నుంచి పుల్లూరుకు వందలాది ట్రక్కుల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. దీనిపై రెవెన్యూ అధికారులకు పలువురు గ్రామస్తులు సమాచారం అందించినా చర్యలు లేవు. ఉదయం ప్రారంభమైన అక్రమ రవాణా సాయంత్రం వరకు సాగింది. ఒక్కో ట్రక్కు గ్రావెల్‌ను రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు అమ్ముకుని వైసీపీ నాయకుల జేబులు నింపుకొంటున్నారు.
గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారని ఎన్నిసార్లు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ గ్రావెల్ అక్రమ రవాణాలో వైసీపీకి చెందిన మండల నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గ్రావెల్ అక్రమ రవాణా సమాచారం రావడంతో గట్టు వద్దకు వెళ్లి ఎక్స్‌కవేటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వీఆర్వో భాషా తెలిపారు. రెవెన్యూ ఉన్నతాధికారులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా, గ్రావెల్ అక్రమ రవాణాపై రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు దృష్టిసారించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాల పేరుచెప్పి తిరువూరులో తవ్వకాలు
తిరువూరు: అధికార పార్టీ నాయకుల అండతో పట్టణ శివారు ప్రాంతాలతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మట్టి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ఎటువంటి అనుమతులు లేకుండానే కాకర్ల కొత్తచెరువును నుంచి సిమెంట్ రోడ్డు మార్జిన్‌లో శనివారం మట్టి తోలకాల పేరుతో ఇతర అవసరాలకు తవ్వకాలు జరిపారని తెలిసింది. ప్రభుత్వ పనులకు, గ్రామ సచివాలయం, ఆర్‌బీసీ, హెల్త్ భవనాల నిర్మాణం పేరుతో ఇసుక తోలకాలకు అనుమతులు తీసుకుంటున్న కొందరు వ్యక్తులు ఇతర అవసరాలకు కూడా వాటిని తరలిస్తున్నారు. ఇసుకను కొన్ని ప్రాంతాల్లో నిల్వ ఉంచి అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక కోసం అర్జీలు పెట్టుకున్నా స్పందించని అధికారులు అధికార పార్టీ నాయకులు ఇసుక కావాలని అడిగిందే తడవుగా తక్షణం నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నిలుపుదల చేయిస్తాం..
ఎంపీడీవో బాలవెంకటేశ్వరరావును వివరణ కోరగా వెంటనే మట్టి తోలకాలు నిలుపుదల చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తహసీల్దార్ స్వర్గం నరసింహారావును వివరణ కోరగా, మట్టి తోలకాలపై ఎవరూ దరఖాస్తు చేయలేదని, ప్రభుత్వ భూములు, చెరువుల్లో మట్టి తోలకాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వబోమన్నారు.